పరిపాలనా రాజధానికి పగడ్బందీ ఏర్పాట్లు.. విశాఖలో ఊపందుకున్న నిర్మాణాలు

విశాఖను పాలనా రాజధాని చేస్తామంటున్న వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి సైలెంట్ గా పనులు కానిచ్చేస్తోంది. రుషికొండపై APTDC ఆధ్వర్యంలో రీ డెవలప్మెంట్ హిల్ రిసార్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి.

Advertisement
Update:2023-01-30 08:06 IST

అమరావతి రాజధాని వ్యవహారంలో అప్పట్లో అధికార టీడీపీ అనుకూల మీడియాలో వరుస కథనాలు వచ్చేవి. అమరావతిలో అక్కడ అది, ఇక్కడ ఇది, ఈ బిల్డింగ్ లో ఈ సౌకర్యాలుంటాయి, ఆ బిల్డింగ్ లో ఆ ప్రత్యేకతలున్నాయంటూ టీడీపీ అనుకూల మీడియాలో మోత మోగిపోయేది. యథావిధిగా సాక్షి దీన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఇప్పుడు సీన్ మారింది. అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. విశాఖలో కొత్త బిల్డింగ్ ల నిర్మాణం మొదలైంది. వాస్తవానికి ఇప్పుడు విశాఖలో కొత్త కట్టడాల గురించి సాక్షి బాకా ఊదాలి, ఈనాడు అస్సలు పట్టించుకోకూడదు. కానీ ఇప్పుడు కూడా ఆ నిర్మాణాల విషయంలో సాక్షి సైలెంట్ గా ఉంటే, ఈనాడు వాటిని హైలెట్ చేయడం ఇక్కడ విశేషం.

విశాఖను పాలనా రాజధాని చేస్తామంటున్న వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి సైలెంట్ గా పనులు కానిచ్చేస్తోంది. రుషికొండపై APTDC ఆధ్వర్యంలో రీ డెవలప్మెంట్ హిల్ రిసార్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. 4 బ్లాకుల్లో నిర్మాణాలు చేపడుతుండగా త్వరలో ఒక బ్లాక్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. వేంగి, గజపతి, కళింగ, విజయనగరం పేర్లతో ఈ బ్లాక్ లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేంగి బ్లాక్ ను 3 నెలల్లోగా పూర్తి చేయాలని టెండర్లు పిలిచారు. ఇటీవల మొత్తం ప్రాజెక్టు నిర్వహణకు కన్సల్టెన్సీని ఆహ్వానించిన APTDC, తాజాగా వేంగి బ్లాక్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్న కంపెనీలు ఫిబ్రవరి మూడో తేదీలోగా బిడ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనాడులో రిషికొండపై ఆసక్తికర కథనాలు వస్తున్నాయి, సాక్షి మాత్రం పరిపాలనా రాజధాని పురోగతిని అస్సలు పట్టించుకోనట్టే ఉంది.

వేంగి బ్లాక్ నుంచే పరిపాలన..

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)కి సమర్పించిన వివరాల ప్రకారం 1713.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేంగి బ్లాక్‌ నిర్మించబోతున్నారు. కిచెన్‌, డార్మెటరీ భవనాలు కూడా ఇందులో ఉంటాయి. వేంగి బ్లాక్ లో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం టెండర్లు పిలవగా భవన నిర్మాణ తుదిదశ పనులు, విద్యుత్ సౌకర్యం, నెట్‌వర్కింగ్‌ పనులతో పాటు కొండవాలు రక్షణ పనులు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పలువురు మంత్రులు కూడా పాలనా రాజధాని విశాఖ తరలివస్తోంది, అతి త్వరలో పాలన మొదలవుతుందంటూ హింట్లిస్తున్నారు. అధికారిక ప్రకటనలు మాత్రం బయటకు రావడంలేదు. పని పూర్తయిన తర్వాత సీఎం జగన్ మంచి మహూర్తం చూసుకుని విశాఖకు షిఫ్ట్ అవుతారని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News