ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకు కోటంరెడ్డి లేఖ
నెల్లూరు రూరల్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఈనెల 17న కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతానన్నారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆయన అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు. ఆ విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం లేఖను కేంద్ర హోంశాఖకు పంపిస్తున్నానని, వీలైతే తానే నేరుగా వెళ్లి లేఖను అందిస్తానని చెప్పారు.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని, ఫోన్ ట్యాపింగ్ జరగలేదన చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, దానిపై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యమ కార్యాచరణ..
నెల్లూరు రూరల్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. నెల్లూరులో అసంపూర్తిగా మిగిలిన రోడ్లు, డ్రైన్ల విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఈనెల 17న కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతానన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని రోడ్లు, పొట్టేపాలెం బ్రిడ్జ్ కోసం, రోడ్లు భవనాల శాఖ ముందు ఈనెల 25వతేదీ ధర్నా చేపడతానన్నారు. ఆలోగా ప్రభుత్వం స్పందిస్తే మంచిదని, లేకపోతే పోరాటం చేసి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసన్నారు. ధర్నాల అనంతరం అందరితో చర్చించి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు కోటంరెడ్డి.
నాకు అంత శక్తి లేదు..
గుంటూరులో బోరుగడ్డ అనిల్ కి చెందిన ఆఫీస్ ని తగలబెట్టించేంత శక్తి తనకు లేదన్నారు కోటంరెడ్డి. ఆ ఆఫీస్ తగలబడటానికి తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారాయన. తనపై వస్తున్న ఆరోపణలను సంతోషంగా స్వీకరిస్తున్నానని చెప్పారు.
ఒకరకంగా అది కూడా తనకు మంచిదేనని, అలా కూడా తనకు పబ్లిసిటీ వస్తుందన్నారు. తాను అధికార పార్టీ శాసన సభ్యుడిగా ఉన్న రోజుల్లో కూడా సాక్షి పత్రిక తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఇప్పుడు పార్టీనుంచి బయటకొచ్చాక తనకోసం అరపేజీ కేటాయించారని, ఆమేరకు తనకు సంతోషంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మొత్తమ్మీద కోటంరెడ్డి ఉద్యమ కార్యాచరణతో నెల్లూరులో వాతావరణం మరోసారి వేడెక్కింది. కార్పొరేటర్లను తమవైపు తిప్పుకోడానికి ఆదాల వర్గం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం అంటూ కోటంరెడ్డి రోడ్డెక్కబోతున్నారు. ముందు ముందు నెల్లూరులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.