వరుసబెట్టి కంప్లయింట్లు.. 8మంది అధికారులే కూటమి టార్గెట్

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖల ద్వారా ఫిర్యాదు చేయడంతోపాటు.. ఢిల్లీలోని బీజేపీ బ్యాచ్ ని, ఇక్కడినుంచి జనసేన, టీడీపీ నేతల్ని పంపించి నేరుగా కంప్లయింట్లు ఇప్పిస్తున్నారు.

Advertisement
Update:2024-04-17 10:05 IST

ఏపీలో కీలక అధికారుల్ని కూటమి టార్గెట్ చేసింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా.. అసలు ఎన్నికలకు సంబంధం లేని టీటీడీ ఈవోని కూడా తక్షణం బదిలీ చేయాలంటూ రచ్చ చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖల ద్వారా ఫిర్యాదు చేయడంతోపాటు.. ఢిల్లీలోని బీజేపీ బ్యాచ్ ని, ఇక్కడినుంచి జనసేన, టీడీపీ నేతల్ని పంపించి నేరుగా కంప్లయింట్లు ఇప్పిస్తున్నారు. ఆ అధికారుల్ని బదిలీ చేస్తేనే ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయంటూ కవరింగ్ గేమ్ మొదలు పెట్టారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ నేతృత్వంలో టీడీపీ, జనసేన కూటమి నేతలు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ని కలిశారు. ఏపీలో మొత్తం 8 మంది అధికారుల్ని వెంటనే బదిలీ చేయాలని ఫిర్యాదు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇన్ చార్జ్ డీజీపీ కొల్లి రఘురామ్‌రెడ్డితోపాటు మరో నలుగురు అధికారుల ప్రవర్తనపై ఎన్నికల సంఘం తక్షణం దృష్టిసారించాలన్నారు. వారంతా జూనియర్‌ అధికారులైనా కూడా వైసీపీ ప్రభుత్వం కీలక స్థానాలు అప్పగించిందని, ఎన్నికల సమయంలో వారు స్వామిభక్తి చూపిస్తున్నారని ఆరోపించారు కూటమి నేతలు. ఆ 8 మందిలో ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఇప్పటికే ఈసీ బదిలీ వేటు వేయడంతో కూటమి నేతలు మరింత రెచ్చిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర భద్రతాబలగాలను మోహరించాలని కూడా ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తిచేశారు కూటమి నేతలు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక పోలీస్ పరిశీలకుడిని నియమించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ బూత్‌లో వీడియోగ్రఫీ తీయించాలని, మహిళ బోగస్‌ ఓట్లను గుర్తించడానికి ప్రతి బూత్‌లో తగిన సంఖ్యలో మహిళా సిబ్బందిని నియమించాలని కోరారు. పదే పదే అదే అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఎలాగైనా వారిని బదిలీ చేయించాలని చూస్తున్నారు కూటమి నేతలు. 

Tags:    
Advertisement

Similar News