పార్టీలోని వలస నాయకుల్ని తరిమికొట్టండి - వైసీపీ నేత

ఈ వలస నాయకుల కారణంగానే తొలి నుంచి వైసీపీ కోసం పనిచేస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు.

Advertisement
Update:2023-01-01 18:45 IST

అనుమానమే లేదు.. వైసీపీ నేతలే తలో చేయి వేసి ఈసారి కూడా హిందూపురంలో బాలకృష్ణను భారీ మెజారిటీతోనే గెలిపించేలా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో లేనన్ని గ్రూపులు హిందూపురం వైసీపీలో తయారయ్యాయి. ఆ గ్రూపులు రోడ్డెక్కి పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లాయి.

తాజాగా వైసీపీ సీనియర్ నేత, ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ వైసీపీలోని వలస నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నూతన ఏడాది ప్రారంభం సందర్భంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ వలస నాయకులకు టికెట్ ఇస్తే పార్టీ గెలిచే అవకాశం కూడా ఉండదని వైసీపీ అధిష్టానాన్ని ఆయన హెచ్చరించారు.

ఈ వలస నాయకుల కారణంగానే తొలి నుంచి వైసీపీ కోసం పనిచేస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ఇక్కడి పరిస్థితులు, ఇక్కడి శ్రేణుల గురించి ఈ వలస నాయకులకు అవగాహన లేదన్నారు. ఈ వలస నాయకులకు టికెట్లు ఇస్తే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారంతా వైసీపీని వీడి అటుగా వెళ్తారని నవీన్ నిశ్చల్ ఆరోపించారు. పార్టీని కాపాడుకునేందుకు ఈ వలస నాయకుల్ని పార్టీ కార్యకర్తలే ముందుండి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

హిందూపురం వైసీపీలో ఒక విధంగా ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు నవీన్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఐదేళ్లపాటు బాలకృష్ణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ఆఖరిలో ఇక్బాల్ వచ్చి టికెట్ సొంతం చేసుకున్నారు. కానీ, బాలకృష్ణను ఓడించలేకపోయారు. నవీన్ కే టికెట్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది అన్న చర్చ కూడా అప్పట్లో నడిచింది.

ఇక్బాల్ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు నియోజకవర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఇక్బాల్ స్థానికంగా ఉండరు అన్న విమర్శ ఉంది. తొలి నుంచి ఉన్న మండల స్థాయి నాయకుల్ని ఆయన ఒక పద్ధతి ప్రకారం దెబ్బతీశారని ఆరోపణలు వచ్చాయి. హిందూపురం వైసీపీ మాజీ ఇంచార్జ్ రామకృష్ణారెడ్డి హత్య కేసులోనూ ఎమ్మెల్సీ ఇక్బాల్ పై వైరి వర్గం సంచలన ఆరోపణలు చేసింది. అయినప్పటికీ ఇక్బాల్ విషయం జగన్ మోహన్ రెడ్డి పునరాలోచన చేసే అవకాశాలు కనిపించడం లేదు.

జగన్మోహన్ రెడ్డి మీద, పార్టీ మీద గౌరవం ఉన్నప్పటికీ ఇక్బాల్ కు టికెట్ ఇస్తే మాత్రం తమ ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఆయన కోసం పనిచేయమని ఇప్పటికే వైసీపీలోని మండల, గ్రామస్థాయి నాయకులు బహిరంగంగానే ప్రెస్ మీట్ లు పెట్టి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఇక్బాలే కాకుండా హిందూపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల మాధవ్ కూడా నాన్ లోకల్. ఇక్బాల్, గోరంట్ల మాధవ్ ఇద్దరిదీ కర్నూలు జిల్లా. దాంతో ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు వారి విషయంలో తొలి నుంచి అంత సఖ్యతగా లేరు.

ఇలా హిందూపురంలో వర్గ విభేదాల కారణంగా వైసీపీ గెలుపు ఖాయం అని ఆ పార్టీ వాళ్లే ధీమాగా చెప్పలేని పరిస్థితి. ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్ కర్నూలు జిల్లాకు చెందిన వారు కావడంతోనే వారిద్దరిని ఉద్దేశించే వలస నాయకులు అని నవీన్ నిశ్చల్ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News