ఏపీలో పథకాలు భేష్.. ఎన్డీసీ బృందం కితాబు

రాష్ట్ర సచివాలయంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మనీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ స్టాఫ్ భేటీ అయ్యారు.

Advertisement
Update:2024-02-10 19:00 IST

ఏపీలో పథకాలు, వాటి అమలు తీరు గురించి వైసీపీ నేతలు ఎంత ఎక్కువగా చెప్పుకున్నా, సాక్షి మీడియాలో ఎంత గొప్పగా రాసుకున్నా అది ఆత్మస్తుతి లానే ఉంటుంది. తటస్థులు, ఇతర ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఆ పథకాలను పొగిడితే ఆ కిక్కే వేరు. ఏపీలో నవరత్నాల విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల వారు, జాతీయ సంస్థల ప్రతినిధులు.. ఏపీలోని సంక్షేమ పథకాలు అద్భుతం అంటున్నారు. వాటి అమలు తీరుని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ కాలేజీ సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్, ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ గుప్తా ఏపీలో సంక్షేమ పథకాలను, వాటి అమలు తీరును ప్రశంసించారు.

ఢిల్లీలోని నేషనల్‌ డిఫెన్స్ కాలేజీకి చెందిన 20 మంది ప్రతినిధుల బృందం మనీష్‌కుమార్‌ నేతృత్వంలో ఏపీలో పర్యటించింది. రెండు రోజులపాటు విశాఖపట్నం, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించారు. లబ్ధిదారులు, ప్రజలతో నేరుగా మాట్లాడారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరుని వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో ఆయా పథకాల అమలు తీరు అద్భుతం అని కొనియాడారు. రైతులు, మహిళలకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న పథకాలతో లబ్ధిదారులకు మేలు జరుగుతోందని, ఇతర రాష్ట్రాలకంటే ఇక్కడి పథకాలు బాగున్నాయని అన్నారు. పథకాల అమలులో మిగతా రాష్ట్రాలకంటే ఏపీ ముందంజలో ఉందన్నారు మనీష్‌ కుమార్‌.

రాష్ట్ర సచివాలయంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మనీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ స్టాఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పథకాల అమలు తీరుని వారికి వివరించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌. విద్య, వైద్యం, మహిళ, రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి పలు కార్యక్రమాలను అమలుచేస్తోందని చెప్పారాయన. ప్రాథమిక వి­ద్యా­భివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తె­లిపారు. విద్య, వైద్య రంగాల్లో మౌ­లిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ­పెద్దఎ­త్తు­న చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ ము­ఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఎన్డీసీ స్టాఫ్ కి వివరించారు. రాష్ట్రంలో ఇంధన శాఖకు సంబంధించిన అంశాలపై ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ చక్రధర్‌బాబు వివరించారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. వైద్య రంగం, వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎన్డీసీ బృందానికి వివరించారు.

Tags:    
Advertisement

Similar News