మాది 'స్కిల్' డెవలప్మెంట్.. మీది 'కిల్' డెవలప్మెంట్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై వారితో నారా లోకేష్ చర్చించారు. చంద్రబాబు జైలులో ఉండటంతో తొలిసారి లోకేష్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ పేరుతో మిలాఖత్ జరిగిందని సీఎం జగన్ ఘాటుగా స్పందించడంతో వెంటనే ఢిల్లీనుంచి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తమది స్కిల్ డెవలప్మెంట్ అని, జగన్ ది కిల్ డెవలప్మెంట్ అని ఎద్దేవా చేశారు. బాబాయ్ పై గొడ్డలివేటు వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.
మీ సంగతేంటి..?
రాజమండ్రి సెంట్రల్ జైలులో జరిగింది మిలాఖత్ అయితే, గతంలో చంచల్ గూడ జైలులో జరిగిన మిలాఖత్ లను ఏమనాలని ప్రశ్నించారు లోకేష్. 2019లో టీడీపీని ఓడించేందుకు ఎంతమందితో జగన్ మిలాఖత్ అయ్యారో చెప్పాలన్నారు. అవినీతి పరులకు, నీతిమంతులపై బురదజల్లాలనే కోరిక ఉంటుందని, అందుకే చంద్రబాబుపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ లో ఏం చేద్దాం..?
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై వారితో నారా లోకేష్ చర్చించారు. చంద్రబాబు జైలులో ఉండటంతో తొలిసారి లోకేష్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకి మద్దతు తెలపడం మినహా టీడీపీకి మరో ఆప్షన్ లేదు. అంటే బిల్లుల విషయంలో టీడీపీ చర్చించాల్సిందేమీ లేదు. అయితే సభలో చంద్రబాబు వ్యవహారం హైలైట్ చేసేలా చూడాలని నాయకులకు ఉపదేశమిచ్చారు లోకేష్. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారనే సింపతీ వచ్చేలా చూడాలని, అన్ని పార్టీలకు ఈ విషయాన్ని టీడీపీ ఎంపీలు చేరవేయాలని సూచించారు. అవసరమైతే పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనల పేరుతో హడావిడి చేయాలని కూడా చెప్పారు లోకేష్. కేంద్రంలోని పెద్దల్ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన లోకేష్, అక్కడ అపాయింట్ మెంట్ లు దొరక్కపోయేసరికి కంగారు పడుతున్నారు. కనీసం పార్లమెంట్ సమావేశాల్లో అయినా టీడీపీ ఎంపీలతో అన్ని పార్టీల నాయకులకు లేఖలు ఇప్పించాలని చూస్తున్నారు.