23వ తేదీ 23 ఓట్లతో విజయం.. దేవుడు రాసిన స్క్రిప్టేనా..!

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తేదీ 23, ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 23. ఇది యాదృచ్ఛికమో లేదో తెలియదు కానీ, లోకేష్ మాత్రం ఈ 23ని లక్కీ నెంబర్ అంటున్నారు.

Advertisement
Update:2023-03-23 20:55 IST

గతంలో టీడీపీని 23 అనే సంఖ్య పట్టి పీడిస్తోందంటూ వైసీపీ విపరీతంగా కామెంట్ చేసేది. 2014 ఎన్నికల తర్వాత 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ లాగేసుకుంది. దాని ఫలితంగానే 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని కార్నర్ చేసింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన తేదీలతో సహా ఇలాంటి లెక్కలన్నీ కలిపి 23 అనేది టీడీపీకి దేవుడు రాసిన స్క్రిప్ట్ అని గతంలో జగన్ కూడా పలుమార్లు ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే 23తో టీడీపీ కాస్త గట్టిగానే బదులిచ్చింది.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తేదీ 23, ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 23. ఇది యాదృచ్ఛికమో లేదో తెలియదు కానీ, లోకేష్ మాత్రం ఈ 23ని లక్కీ నెంబర్ అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం తర్వాత నారా లోకేష్ ఇలా ట్వీట్ చేశారు.

"మేము 23 సీట్లే గెలిచామ‌ని ఎద్దేవ చేశావు. అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. చివ‌రికి అదే 23వ తేదీన‌, అదే 23 ఓట్ల‌తో నీ ఓట‌మి-మా గెలుపు. ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు!" అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.

మొత్తానికి వరుస విజయాలతో టీడీపీ ఫుల్ జోష్ తో కనిపిస్తోంది. మూడు పట్టభద్రుల స్థానాల్లో ఓట్లువేసిన వారు కేవలం ఓ వర్గం మాత్రమే అనుకున్నా, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కే షాకిచ్చారు సొంతపార్టీ ఎమ్మెల్యేలు. నారా లోకేష్ కౌంటర్ కి వైసీపీ నుంచి ఎవరు, ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News