టీడీపీ నేత హత్య.. లోకేష్ రియాక్షన్ ఏంటంటే..?
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేష్ ట్వీట్ సమర్థించినట్టయింది.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. దాడులు జరుగుతున్నాయనే ఆరోపణల్లో కాస్తో కూస్తో వాస్తవం ఉన్నా.. అవి టీడీపీ నేతలపై జరుగుతున్నవని, బాధితులు టీడీపీ కార్యకర్తలని ఈ పార్టీ నేతలంటున్నారు. అయితే అధికారంలో ఉండి కూడా తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ చెప్పుకోవాల్సిరావడం ఇక్కడ విచిత్రం. తాజాగా టీడీపీ నేత దారుణ హత్యకు గురికావడం మరింత సంచలనంగా మారిన విషయం. మరి దీన్ని రాజకీయ హత్య అంటారా, లేక వ్యక్తిగత దాడి అంటారా అనేది తేలాల్సి ఉంది.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు వైరి వర్గం చేతిలో హతమయ్యారు. ఆయన వయసు 48 ఏళ్లు. ఈరోజు ఉదయం బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి తిరిగి రాలేదు. దారికాచి ఆయన కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇది వైసీపీ పనేనని అంటున్నారు నారా లోకేష్. ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురైనా, జగన్ అండ్ కో తమ పాత పంథాను మార్చుకోలేదని, ఇంకా దురాగతాలకు పాల్పడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దన్నారు. దాడులకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు లోకేష్.
ఇప్పటి వరకూ తమ కార్యకర్తలు చనిపోయారని, టీడీపీయే కారణం అని వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. తమ పార్టీ వారిని వైసీపీ హతమారుస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఇక్కడ అధికారంలో ఉంది టీడీపీయే కావడం విశేషం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేష్ ట్వీట్ సమర్థించినట్టయింది.