పేరుకే పవన్ డిప్యూటీ.. ప్రజా దర్బార్ తో లోకేష్ దర్జా
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలేవీ మొదలు పెట్టక ముందే తనకు తానుగా దర్బార్ అనే సంస్కృతిని తీసుకొచ్చి ప్రభుత్వంలో తాను కూడా కీలకం అనే సందేశం పంపించారు లోకేష్.
ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ఎవరికి ప్రాధాన్యం ఉంటుంది..? ప్రోటోకాల్ ప్రకారమైతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ఉండాలి. కానీ ఇక్కడ నారా లోకేష్ జోరుమీదున్నారు. సీఎం కొడుకు అనే హోదాలో లోకేష్ మంత్రి పదవికి మించి తన దర్పం చూపిస్తున్నారనే వాదన వినపడుతోంది. తాజాగా ఉండవల్లిలో నారా లోకేష్ 'ప్రజా దర్బార్' నిర్వహించారు. మంగళగిరి ఎమ్మెల్యేగానో, లేక మంత్రిగానో కాదు.. అంతకు మించిన బాధ్యతను తనకు తానే మీద వేసుకుని రాష్ట్రంలోని అందరి సమస్యలు విన్నారు, అందరికీ ధారాళంగా హామీలిచ్చేశారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆమధ్య ప్రజా దర్బార్ ప్రారంభమైంది. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు కూడా అప్పుడప్పుడు ప్రజా దర్బార్ లో పాల్గొనేవారు, ఫిర్యాదులు స్వీకరించేవారు. కానీ ఏపీలో లోకేష్ తనకు తానే ప్రజా దర్బార్ మొదలు పెట్టారు. అది కూడా ఉండవల్లిలోని తన నివాసంలో. మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమం పెట్టి ఉంటే.. స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకు కష్టాలు చెప్పుకునేవారు ప్రజలు. కానీ ఉండవల్లిలో ప్రత్యేకంగా ప్రజా దర్బార్ పెట్టి.. తనకు తానుగా లేని ఇమేజ్ తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేశారు లోకేష్.
ఈ ప్రజా దర్బార్ లో కేవలం లోకేష్ శాఖల గురించే కాదు, ఇతర అన్ని శాఖలకు చెందిన సమస్యలను ఆయన పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున వైద్యసాయం అందిస్తామని కొందరికి మాటిచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారిస్తామని చెప్పారు. భూ వివాదాలు, ఇతరత్రా సమస్యలన్నీ ఓపిగ్గా విన్నారు, వారికి భరోసా ఇచ్చి పంపించారు. అయితే ఈ ప్రజా దర్బార్ కేవలం హడావిడి మాత్రమేనా, లేక చిత్తశుద్ధితో కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలేవీ మొదలు పెట్టక ముందే తనకు తానుగా దర్బార్ అనే సంస్కృతిని తీసుకొచ్చి ప్రభుత్వంలో తాను కూడా కీలకం అనే సందేశం పంపించారు లోకేష్.