సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లకు జై కొట్టిన లోకేష్
వైసీపీ పథకాలను రద్దు చేస్తామని చెప్పలేదు, జగన్ తీసుకొచ్చిన కొత్త వ్యవస్థలను తప్పుబట్టలేదు. అంత మాత్రాన ఏపీలో ప్రభుత్వం మారడం దేనికి అనే ప్రశ్నకు టీడీపీ నేతల దగ్గర బదులు లేదు.
ఇన్నాళ్లూ గ్రామ, వార్డు సచివాలయాలు పనికి రావన్నారు చంద్రబాబు. గ్రామ పంచాయితీలుండగా మళ్లీ సచివాలయాలెందుకు దండగ అన్నారు. సచివాలయ ఉద్యోగుల్ని కూడా వారు చిన్నచూపు చూశారు. వారు ఎన్నికల విధులకు పనికిరారన్నారు. ఇక వాలంటీర్ల విషయంలో టీడీపీ చాలాసార్లు విషాన్ని వెళ్లగక్కింది. వారంతా వైసీపీ కార్యకర్తలేనని ముద్ర వేయాలని చూసింది. ఓ దశలో వాలంటీర్లు మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారని నింద వేసి ఆ తర్వాత తీరిగ్గా నాలుక కరుచుకున్నారు పవన్ కల్యాణ్. దీంతో వైసీపీ నుంచి ఓ డిమాండ్ బయటకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ పోస్టుల్ని రద్దు చేస్తామని టీడీపీ-జనసేన చెప్పాలని సవాల్ విసిరారు వైసీపీ నేతలు. ఆ సవాల్ కి ఎలా స్పందించాలో తెలియని ఎల్లో బ్యాచ్.. ఎన్నికల వేళ తోకముడిచింది. విధిలేని పరిస్థితుల్లో వాలంటీర్, సచివాలయ వ్యవస్థకు టీడీపీ జై కొట్టింది.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పలేమన్నారు నారా లోకేష్. ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదన్నారాయన. స్థానిక సంస్థలతో కలిసి వాటిని బలోపేతం చేసి పనితీరు మెరుగుపరుస్తామన్నారు. వాలంటీర్లపై కూడా సింపతీ చూపించారు. మొత్తానికి లోకేష్ మడమ తిప్పారు. ఏయే వ్యవస్థలు పనికి రావు అన్నారో.. అవన్నీ మంచి వ్యవస్థలు అని స్పష్టం చేశారు. వాటిని రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని నొక్కి వక్కాణించారు.
టీడీపీకి ప్రత్యామ్నాయం లేదు..
వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించే టీడీపీ ఎన్నికల వేళ పూర్తిగా ఇరుకునపడింది. వైసీపీ పథకాలను రద్దు చేస్తామని చెప్పలేదు, జగన్ తీసుకొచ్చిన కొత్త వ్యవస్థలను తప్పుబట్టలేదు. అంత మాత్రాన ఏపీలో ప్రభుత్వం మారడం దేనికి అనే ప్రశ్నకు వారి దగ్గర బదులు లేదు. జగన్ పథకాలను కొనసాగిస్తాం, ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలను అలాగే నడిపిస్తామంటున్న టీడీపీ.. రాష్ట్రానికి తమ అవసరం ఏంటనేది మాత్రం చెప్పలేకపోతోంది. ఒకరకంగా జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని టీడీపీ సమర్థించాల్సిన పరిస్థితికి వచ్చేసింది.