గొడ్డలిపోటు వర్సెస్ వెన్నుపోటు.. లోకేష్ మళ్లీ బుక్కయ్యాడు..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం వెళ్తున్న జగన్ ఆలయం ముందు ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేశారు లోకేష్. అలా ప్రమాణం చేయకపోతే అది జగన్ చేయించిన పనే అని నమ్మాల్సి వస్తుందని అంటున్నారు.
నారా లోకేష్ ఏదో చేయాలనుకుంటారు, చివరకు అది ఏదో అవుతుంది. ఆమధ్య పరామర్శ యాత్రలకు వెళ్లినప్పుడు లోకేష్ సినిమా డైలాగులు పేల్చేవారు. వాడు వీడు అంటూ ఓ రేంజ్ లో ఫైరయ్యేవారు. ఆ తర్వాత వైసీపీ నుంచి గట్టిగా కౌంటర్లు పడేసరికి కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. తిరిగి ఇప్పుడు మళ్లీ ట్విట్టర్లో ఆయన సవాళ్లు విసురుతున్నారు. అయితే ఇప్పుడు కూడా ఆయన గట్టిగా ట్రోలింగ్ కి బలవుతున్నారు.
ఇంతకీ లోకేష్ ట్వీట్ ఏంటి..?
''వివేకా హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్ హత్యతో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమా? ప్రమాణం చేయకపోతే గొడ్డలి పోటు జగనాసుర రక్తచరిత్ర అని ఒప్పుకొంటారా?'' అని లోకేష్ ట్విట్టర్లో జగన్ కు సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకోసం వెళ్తున్న జగన్ ఆలయం ముందు ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేశారు లోకేష్. అలా ప్రమాణం చేయకపోతే అది జగన్ చేయించిన పనే అని నమ్మాల్సి వస్తుందని అంటున్నారాయన. గతంలో వివేకా హత్యకు తనకు సంబంధం లేదంటూ తిరుమలలో ప్రమాణం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు లోకేష్.
కౌంటర్లు ఇలా..
వివేకా హత్య సంగతి పక్కనపెడితే.. గతంలో ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదని లోకేష్ ప్రమాణం చేయగలడా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో వెన్నుపోటు ఎపిసోడ్ హైలెట్ అవుతోంది. అందుకే నెటిజన్లంతా గొడ్డలిపోటు వ్యాఖ్యలకి కౌంటర్ గా వెన్నుపోటుని తెరపైకి తెస్తున్నారు. తన తండ్రి తన తాతకు వెన్నుపోటు పొడవలేదని లోకేష్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అది నారా వారి పార్టీయా, నందమూరి వారి పార్టీయా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మొత్తమ్మీద జగన్ ని టార్గెట్ చేయబోయిన లోకేష్ మరోసారి నెటిజన్లకు బుక్కయ్యారు.