పాదయాత్ర - దండయాత్ర.. లోకేష్ పంచ్ డైలాగులు

పద్ధతిగా సాగినంతకాలం తనది పాదయాత్ర అవుతుందని అడ్డుకోవాలని చూస్తే దండయాత్ర అవుతుందని హెచ్చరించారు లోకేష్.

Advertisement
Update:2023-04-25 22:25 IST

"పద్ధతిగా సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర తప్పదు." అంటూ యువగళం యాత్రలో పంచ్ డైలాగులు విసిరారు నారా లోకేష్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్న లోకేష్.. సీఎం జగన్ పై మండిపడ్డారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి జగన్‌ భయపడ్డారని అన్నారు లోకేష్. తనను అడ్డుకోవడానికి ముందు పోలీసులను పంపారని, ఆ మోడల్‌ సక్సెస్‌ కాలేదని ఇప్పుడు వైసీపీ నేతల్ని ఉసిగొల్పుతున్నారని చెప్పారు. పద్ధతిగా సాగినంతకాలం తనది పాదయాత్ర అవుతుందని అడ్డుకోవాలని చూస్తే దండయాత్ర అవుతుందని హెచ్చరించారు.

డైవర్షన్ పాలిటిక్స్..

వివేకా హత్య కేసు విచారణలో వైఎస్ కుటుంబమంతా బుక్కైపోయిందని, దానిపైనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం జగన్‌ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు లోకేష్. అందులో భాగంగానే తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వారి సొంత మీడియాలో ప్రచారం చేశారని మండిపడ్డారు.


రావాలి జగన్, కావాలి జగన్..

బాబాయ్‌ హత్య కేసులో కుటుంబమంతా బుక్కైపోయిందని, ఒక బాబాయ్‌(వివేకా) ని లేపేసిన కేసులో మరో బాబాయ్(భాస్కర్ రెడ్డి) జైలుకు వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. త్వరలో అబ్బాయిలు కూడా జైలుకు పోవడం ఖాయమన్నారు. రావాలి జగన్‌, కావాలి జగన్‌ అని చంచల్‌ గూడ జైలు పిలుస్తోందని సెటైర్లు వేశారు. తర్వాత జైలుకెళ్లేది ఎవరనే విషయంపై ఏపీలో బెట్టింగ్‌ లు నడుస్తున్నాయని చెప్పారు లోకేష్. జగన్ త్వరలో జైలుకి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News