గవర్నర్ కు ఫిర్యాదు.. లోకేష్ సాధించేదేంటి..?

గవర్నర్ ని కలసిన తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్ అక్కడ కూడా సినిమా డైలాగులు కొట్టారు. దొంగ కేసులకు భయపడబోమని.. భయం తమ బయోడేటాలోనే లేదన్నారు.

Advertisement
Update:2023-11-07 21:26 IST

టీడీపీ సానుభూతిపరులపై కేసులు పెడుతున్నారంటూ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఈ కేసుల ప్రయారిటీతోనే కార్యకర్తలకు పదవులు ఇస్తానన్న ఆయన.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యే సరికి సడన్ గా ప్లేటు ఫిరాయించారు. చివరకు ఆయన్ను కూడా అరెస్ట్ భయం వెంటాడింది. దీంతో ఈ కేసుల వ్యవహారంలో ఆయన రాద్ధాంతం మొదలు పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ సానుభూతి పరులపై 60వేల కేసులు పెట్టారనేది నారా లోకేష్ ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో నేరుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలసి ఫిర్యాదు చేశారు.


వైసీపీ పాలనలో ఏపీ, దక్షిణ భారత బీహార్‌ గా మారిందని విమర్శించారు లోకేష్. విజయవాడ రాజ్‌ భవన్‌ లో టీడీపీ బృందంతో సహా గవర్నర్‌ ను కలసి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ కు నరనరానా కక్ష సాధింపే ఉందని అన్నారు లోకేష్. టీడీపీ అంటే చాలు కేసులు పెడుతున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా జైలుకి పంపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై కూడా ఆధారాలు లేకుండా కేసులు పెట్టారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్‌ ను కోరామని తెలిపారు లోకేష్. పవన్ కల్యాణ్ ని ఏపీకి రాకుండా అడ్డుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

భయం మా బయోటేడాలో లేదు..

గవర్నర్ ని కలసిన తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్ అక్కడ కూడా సినిమా డైలాగులు కొట్టారు. దొంగ కేసులకు భయపడబోమని.. భయం తమ బయోడేటాలోనే లేదన్నారు. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. ఇక జనసేనతో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు లోకేష్. కరువు, తాగునీటి సమస్యలపై జనసేనతో కలసి ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. 

Tags:    
Advertisement

Similar News