త్వరలో తల్లికి వందనం.. లోకేష్ క్లారిటీ
విద్యా కానుక పథకంలో కూడా నిధుల దుర్వినియోగం జరిగిందని అంటున్నారు మంత్రి లోకేష్. కుంభకోణాలను వెలికి తీస్తామని, విచారణ చేపడతామని చెప్పారు.
అమ్మఒడికి ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం తెరపైకి తేవాలనుకుంటున్న తల్లికి వందనం పథకం విషయంలో ఇటీవల గందరగోళం నెలకొంది. ఇప్పటికే దీనిపై శాసన మండలిలో ఓసారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. పిల్లల సంఖ్య విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వగా.. పథకం అమలు ఎప్పటినుంచి అనేదానిపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. దీంతో లోకేష్ మరోసారి ఈ పథకంపై శాసన మండలిలో మాట్లాడారు. తల్లికి వందనం పథకం త్వరలో అమలు చేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదంతా ఫేక్..
తల్లికి వందనంపై తాను సభలో చేసిన ప్రకటనని వక్రీకరించిన మీడియాపై చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఫేక్ ప్రచారం జరుగుతోందని చెప్పారు. చదువుకునే ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామన్నారాయన. అదే సమయంలో ఈ పథకం వచ్చే ఏడాదికి వాయిదా పడిందనే వార్తల్ని ఖండించారు. త్వరలోనే తల్లికి వందనం మొదలవుతుందన్నారు లోకేష్.
ఇటీవల నాడు-నేడు పథకంపై అసెంబ్లీలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. తాజాగా విద్యా కానుక పథకంలో కూడా నిధుల దుర్వినియోగం జరిగిందని అంటున్నారు మంత్రి లోకేష్. విద్యాకానుక విషయంలో జరిగిన కుంభకోణాలను వెలికి తీస్తామని, విచారణ చేపడతామని అన్నారాయన. స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, బెల్టులపైన వైసీపీ రంగులు అవసరం లేదని చెప్పారు. అవన్నీ పిల్లలకు ఇన్స్ పిరేషన్ గా ఉండేలా డిజైన్ చేస్తామని అన్నారు లోకేష్.
రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని మరోసారి సభలో స్పష్టం చేశారు నారా లోకేష్. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే, 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చామని, ప్రైవేటు పెట్టుబడులు, ఉద్యోగాలపై ఇప్పటికే తమ పని మొదలైందని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు లోకేష్.