గత అనుభవం నేర్పిన పాఠాలతో..
యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని తాను హామీ ఇచ్చానని, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆ మార్పులు అమలు చేస్తానని అంటున్నారు లోకేష్.
గత అనుభవం నేర్పిన పాఠాలతో ఈసారి తన శాఖను మరింత సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు నారా లోకేష్. మంత్రులకు శాఖలు కేటాయించిన అనంతరం లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. తనకు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్.. శాఖను కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ వేశారు లోకేష్.
మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు నారా లోకేష్. గతంలో పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని గుర్తు చేశారు. విభజన తర్వాత రాష్ట్రానికి తొలి ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానన్నారు. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు లోకేష్.
సమూల మార్పులు..
హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ విభాగంలో భాగంగా విద్యాశాఖ కూడా నారా లోకేష్ కే దక్కడం విశేషం. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని తాను హామీ ఇచ్చానని, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆ మార్పులు అమలు చేస్తానని అంటున్నారు లోకేష్. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న తనకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం లభించిందని దీన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నానని అన్నారు. రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానన్నారు లోకేష్.