తిరుమలలో భువనేశ్వరి పూజలు.. రేపటి నుంచి నిజం గెలవాలి యాత్ర
రేపట్నుంచి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో ఆమె ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నిజం గెలవాలి యాత్ర విఘ్నాలు లేకుండా జరిగేలా చూడాలని తిరుమల శ్రీవారిని మొక్కుకున్నారు నారా భువనేశ్వరి. రేపట్నుంచి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో ఆమె ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం ఇచ్చారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల యాత్ర అనంతరం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు భువనేశ్వరి. అక్కడ కులదేవతకు పూజలు చేస్తారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులను సందర్శిస్తారు.
రేపట్నుంచి నిజం గెలవాలి..
నిజం గెలవాలి యాత్రను రేపటి నుంచి భువనేశ్వరి మొదలుపెడతారు. నారావారిపల్లె నుంచి ఆమె బస్సులో బయలుదేరుతారు. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో ప్రజలతో సహపంక్తి భోజనం చేస్తారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో ఆమె పాల్గొంటారు. ఆ తర్వాత తిరుపతి దామినేడులో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చేందిన కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. తిరుపతి జిల్లాలో రెండు రోజులపాటు ఈ పర్యటన ఉంటుంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ పని అయిపోయిందనే మాట ఎక్కువగా వినపడుతోంది. కష్టకాలంలో లోకేష్ ఏమీ చేయలేరని తేలిపోయింది. రాజమండ్రిలో.. భువనేశ్వరి, బ్రాహ్మణి.. మీడియాతో మాట్లాడినా పెద్దగా స్పందన లేదు. ఇప్పుడు భువనేశ్వరి పరామర్శ యాత్ర, అందులోనూ బాలకృష్ణను వద్దని తాను చేపడుతున్న యాత్ర.. దీనికి స్పందన ఎలా ఉంటుదనేదే ప్రశ్న. ఈ యాత్ర కూడా ఫెయిలైతే.. ఇక టీడీపీ పరిస్థితి దిక్కులేని నావలా మారిపోయినట్టే లెక్క.
♦