నా భర్త సింహం.. భువనేశ్వరి పంచ్ డైలాగులు

అవినీతి మరక అంటించి 17 రోజులుగా చంద్రబాబుని జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి. ఆయనేం తప్పు చేశారని అన్నారు. హైదరాబాద్ లో రాళ్లు, రప్పలున్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మించారని చెప్పారు.

Advertisement
Update:2023-09-25 16:25 IST

తన భర్త సింహం లాంటి వాడని, సింహంలా జైలు నుంచి బయటకొచ్చి ప్రజల కోసం మళ్లీ పనిచేస్తారని పంచ్ డైలాగులు కొట్టారు నారా భువనేశ్వరి. రాష్ట్రం కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారామె. ప్రజల ఆదరాభిమానాలే ఆయనకు కొండంత అండ అని చెప్పారు. జగ్గంపేట నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె.. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.

మాకు లేని డబ్బులా..?

ప్రజల డబ్బు దోచుకోవాల్సిన అవసరం తమకేముందని అన్నారు నారా భువనేశ్వరి. తాను హెరిటేజ్ కంపెనీ నడుపుతున్నానని, 2శాతం వాటా తమది కాదనుకుంటే 400 కోట్ల రూపాయలు వస్తాయన్నారు. అలాంటిది తాము ప్రజల డబ్బు కోసం ఎందుకు ఆశిస్తామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. సొమ్ము కోసం కాదని, ప్రజల కోసమే తాము వస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 2 వేల మంది అనాథ పిల్లలను ఉచితంగా చదివిస్తున్నామని చెప్పారు భువనేశ్వరి.

ఆయనేం తప్పు చేశారు..?

అవినీతి మరక అంటించి 17 రోజులుగా చంద్రబాబుని జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి. ఆయనేం తప్పు చేశారని అన్నారు. హైదరాబాద్ లో రాళ్లు, రప్పలున్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మించారని, కనీసం సదుపాయాలు లేని ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటని ఆనాడు అందరూ నవ్వారని, కానీ ఇప్పుడు అక్కడ వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు భువనేశ్వరి. చంద్రబాబు సంపద సృష్టించే నాయకుడన్నారు. బ్రిటిష్ పాలనలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తులు జైలుకు వెళ్లారని, ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ కోవలోనే జైలుకెళ్లారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా లబ్ది పొందినవారు ఉన్నత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని, యువత జీవితాలు మార్చడం తప్పా? అని ప్రశ్నించారు. ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తుంటే పోలీసులు భయపెట్టి ఎక్కడికక్కడ అడ్డుకున్నారని, వారి సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారని.. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తెలంగాణ నుండి ఏపీకి రావడానికి వీసా కావాలా? అని ప్రశ్నించారు.

బాబుకోసం పూజలు..

చంద్రబాబు కోసం అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని సత్యనారాయణ స్వామిని కోరుకున్నట్టు తెలిపారు భువనేశ్వరి.

Tags:    
Advertisement

Similar News