భువనేశ్వరి రంగంలోకి దిగబోతున్నారా?
ఆగష్టు మొదటివారంలో భువనేశ్వరి కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలపై మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవబోతున్నారు.
పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. అయితే భువనేశ్వరి రంగంలోకి దిగబోయేది రాబోయే ఎన్నికల్లో పోటీకి కాదు, ప్రచారానికి మాత్రమే. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి పార్టీ తరపున ప్రచారం చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందుకు కుప్పంలోనే రిహార్సల్స్ వేయబోతున్నారు. ఆగష్టు మొదటివారంలో భువనేశ్వరి కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే మెడికల్ క్యాంపులో పాల్గొంటారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు జరిగే విషయం అందరికీ తెలిసిందే.
మెడికల్ క్యాంపులో భువనేశ్వరి పాల్గొనటం పెద్ద విశేషం ఏమీలేదు. అయితే ఆ తర్వాత మహిళలతో జరగబోయే సమావేశంలో పాల్గొనటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలపై మహిళలతో భువనేశ్వరి ప్రత్యేకంగా సమావేశమవబోతున్నారు. మహిళ కోసం మినీ మ్యానిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలను గుప్పించారు. వాటిపై మహిళలతో ఆమె మాట్లాడుతారు. గతంలో ఇలాంటి రాజకీయ సమావేశాల్లో భువనేశ్వరి ఎప్పుడూ పాల్గొనలేదు.
చివరగా తెలుగు యువత ఆధ్వర్యంలో మొదలవ్వబోయే సైకిల్ యాత్రను కూడా భువనేశ్వరి ప్రారంభించబోతున్నారు. పనిలోపనిగా నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో కూడా ఆమె భేటీ ఉంటుంది. పార్టీ మ్యానిఫెస్టో గురించి మహిళలతో మాట్లాడటం, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవ్వటం భువనేశ్వరికి ఇదే మొదటసారి. గతంలో పార్టీ నేతలతో రెండుమూడు సార్లు టెలి కాన్ఫరెన్సులో పోలింగుకు ముందు మాత్రమే ఆమె మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మ్యానిఫెస్టోలో మహిళ కోసం ఉద్దేశించిన పథకాలపై కుప్పంలో మహిళలతో భువనేశ్వరిని మాట్లాడించటంలో చంద్రబాబు ఉద్దేశం అర్థమవుతోంది. ఒకటి రెండు సార్లు రెగ్యులర్‌గా మహిళలతో మాట్లాడించిన తర్వాత ఫీడ్ బ్యాక్ తెప్పించుకోబోతున్నారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లోని మహిళలతో కూడా భువనేశ్వరి సమావేశాలు ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారట. అంటే ఎన్నికల్లో భువనేశ్వరితో రాష్ట్రమంతా ప్రచారం చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోంది. పోయిన ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్‌కు మద్దతుగా బ్రాహ్మణి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అత్తా కోడళ్లును ప్రచారంలోకి దింపటానికి చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నట్లే ఉన్నారు.