రిపేర్ వర్క్ మిగిలుంది -నాగబాబు
రిపేర్ వర్క్ లు ఉన్నాయని చెబుతున్న నాగబాబు.. ఆ పనులన్నీ పవన్ ఒక్కరే పూర్తి చేస్తారా, లేక తాను కూడా సాయం చేసే అవకాశం ఉందా.. అనేది మాత్రం చెప్పలేదు.
ఏపీలో సమాజాన్ని కొన్ని విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు జనసేన నేత నాగబాబు. ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వేళ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ను డిప్యూటీ సీఎంగా చూడటం ఆనందంగా ఉందన్నారాయన. అన్ని విషయాల్లో సామర్థ్యం, అన్ని అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి పవన్ అని చెప్పారు నాగబాబు. పవన్ కి తగిన పదవులు, శాఖలు వచ్చాయని అన్నారు. సమర్ధత కలిగిన తన తమ్ముడికి డిప్యూటీ సీఎం పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు.
వాస్తవానికి నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. ఆయన ఎంపీగా లోక్ సభకు పోటీ చేయాలనుకున్నారు, కానీ పొత్తుల్లో భాగంగా సీటు క్యాన్సిల్ చేశారు పవన్ కల్యాణ్. కూటమి విజయం తర్వాత నాగబాబుకి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. తొలుత ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన సున్నితంగా ఆ ప్రచారాన్ని ఖండించారు. ఆ తర్వాత కూటమిపై విష ప్రచారం జరుగుతుందంటూ నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. తమ్ముడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విజయవాడలో పార్టీ నేతలతో కలసి సంబరాలు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ లేని సమయంలో పార్టీ వ్యవహారాలను కూడా నాగబాబు చూసుకునేవారు. ఇప్పుడు పవన్ శాఖల్లో కూడా నాగబాబు ప్రమేయం ఉండదని చెప్పలేం. రిపేర్ వర్క్ లు ఉన్నాయని చెబుతున్న నాగబాబు.. ఆ పనులన్నీ పవన్ ఒక్కరే పూర్తి చేస్తారా, లేక తాను కూడా సాయం చేసే అవకాశం ఉందా.. అనేది మాత్రం చెప్పలేదు.