కేసులు నమోదు చేస్తున్నాం, కఠిన చర్యలు తీసుకుంటాం

అక్రమాలు చేసిన వారిని, తూకంలో మోసం చేసిన వారిని.. ఎవర్నీ వదిలిపెట్టబోమని చెప్పారు మంత్రి నాదెండ్ల. అక్రమార్కులందరిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Update: 2024-06-18 12:34 GMT

పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తనిఖీలతో అధికారుల్ని పరుగులు పెట్టించిన నాదెండ్ల మనోహర్ తాజాగా ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూనికలు కొలతల విభాగంలో తనిఖీలు ఎలా జరుగుతున్నాయనే విషయంపై ఆరా తీశారు. ఇటీవల తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్ లో కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడా కనిపించిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలోని మొత్తం 253 మండల లెవల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ కేంద్రాల్లో తనిఖీలు పూర్తయ్యాయని, వాటిలో 24 చోట్ల అక్రమాలు జరుగుతున్నట్టు తేలాయని చెప్పారు. బాధ్యులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని, తక్కువ తూకంతో సరకులు సరఫరా చేసిన వారిపై కేసులు నమోదు చేయబోతున్నట్టు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.

అక్రమాలు చేసిన వారిని, తూకంలో మోసం చేసిన వారిని.. ఎవర్నీ వదిలిపెట్టబోమని చెప్పారు మంత్రి నాదెండ్ల. అక్రమార్కులందరిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే సరుకుల్లో దోపిడీ చేయడం క్షమించరాని నేరం అన్నారాయన. ప్రజలంతా మార్పు కోరుకున్నారని, ఆమేరకు మార్పుని వారికి చూపిస్తామన్నారు. ప్రజల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ఉపేక్షించేది లేదన్నారు మంత్రి నాదెండ్ల.

కొత్త మంత్రులు బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస సమీక్షలు జరుగుతున్నాయి. ఆయా విభాగాల్లో గతంలో జరిగిన వ్యవహారాలను వారు సునిశితంగా విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మార్పు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో కూడా అవినీతి జరుగుతున్నట్టు ఆరోపించిన మంత్రి నాదెండ్ల, తమ హయాంలో అన్నీ సరిదిద్దుతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News