ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.. వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్
తన ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారనే విషయం 3 నెలలుగా తనకు తెలుసని, అలా రికార్డ్ చేస్తున్నవారు తననుంచి ఏం వినాలనుకుంటున్నారో అదే తాను మాట్లాడుతున్నానని అన్నారు. అందుకే తాను 12 సిమ్ లు వాడుతున్నానని చెప్పారు.
గతంలో పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో, ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతే హంగామాకి కారణం అవుతోంది. అందులోనూ తన ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది ప్రతిపక్ష నేత కాదు, సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే. అవును, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా తనకీ ఖర్మేంటని వాపోయారు.
వాట్సప్, టెలిగ్రామ్ కాల్స్ కూడా..
తన ఫోన్లతోపాటు వాట్సప్ కాల్స్, టెలిగ్రామ్ కాల్స్ కూడా ట్యాపింగ్ కి గురవుతున్నాయని అంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారనే విషయం 3 నెలలుగా తనకు తెలుసని, అలా రికార్డ్ చేస్తున్నవారు తననుంచి ఏం వినాలనుకుంటున్నారో అదే తాను మాట్లాడుతున్నానని అన్నారు. అందుకే తాను 12 సిమ్ లు వాడుతున్నానని చెప్పారు.
అసలేం జరిగింది..?
ఆరోగ్య రక్ష అనే ఓ కార్యక్రమం మొదలు పెడుతున్నట్టు ప్రకటించేందుకు ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ కి ముందు మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతున్న ఆయనకు అక్కడ ఇంటెలిజెన్స్ సిబ్బంది కనిపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై నిఘా పెట్టి, ఇప్పుడు కూడా తనపై నిఘా పెట్టడమేంటని వారిని ఆయన నిలదీశారు. మిమ్మల్ని ఎవరు పంపించారు, ఎందుకు పంపించారో నాకు తెలుసు అంటూ చిందులు తొక్కారు. నా ఫోన్ 3 నెలలుగా ట్యాప్ చేస్తున్నారుగా ఇంకా ఎందుకీ ఇంటెలిజెన్స్ నిఘా అంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న ఓ ఫోన్ చూపించి, ఈ నెంబర్ నా భార్యకు కూడా తెలియదు.. మీ కోసమే నేను 12 సిమ్ కార్డులు వాడుతున్నానంటూ వారిని గదమాయించారు. ఎమ్మెల్యే సమాధానంతో ఇంటెలిజెన్స్ సిబ్బంది షాకయ్యారు. సహజంగా ప్రతిపక్షాల నేతలు ప్రెస్ మీట్లు పెట్టినా, నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ కి ముందు వారు అక్కడ కనపడటంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చీవాట్లు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అక్కడే బయటపడింది.
అందరిపై నిఘా పెట్టారా..?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇటీవల సామాజిక పెన్షన్ల ఏరివేత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు రాష్ట్ర ఆర్థిక శాఖలోని ఓ కీలక అధికారిపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. తాను ఆఫీస్ కి వెళ్తే కనీసం కూర్చోమని కూడా సదరు అధికారి చెప్పలేదని మండిపడ్డారు. ఆ తర్వాత సీఎం జగన్ దగ్గర కూడా ఇదే విషయంలో పంచాయితీ జరిగింది. శ్రీధర్ రెడ్డిపై నిఘా పెడితే కచ్చితంగా అసంతృప్త ఎమ్మెల్యేలందరిపై కూడా నిఘా ఉండి ఉంటుందని, వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ లోనే ఉంటాయని అంటున్నారు.