విషమిచ్చి వీధికుక్కలను చంపడంపై కలకలం.. - మేనకాగాంధీ ఆరా.. విచారణకు కలెక్టర్ ఆదేశం
మృతిచెందిన శునకాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను జాతీయ జంతు సంక్షేమ బోర్డు సభ్యురాలు, ఎంపీ మేనకా గాంధీ కి పంపించారు. దీనిపై స్పందించిన మేనకాగాంధీ తూర్పుగోదావరి కలెక్టర్‌ను ఆరా తీశారు.
తూర్పుగోదావరి జిల్లాలో విషమిచ్చి వీధి కుక్కలను చంపారంటూ వచ్చిన ఆరోపణలపై కలకలం రేగింది. జాతీయ జంతు సంక్షేమ బోర్డు సభ్యురాలు, ఎంపీ మేనకా గాంధీ జిల్లా కలెక్టర్ మాధవీలతకు ఫోన్ చేసి ఆరా తీయడంతో ఆమె ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూడ్చిన శునకాలను బయటికి తీయించి మార్చి ఒకటో తేదీన పోస్టుమార్టం చేయించారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రులో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల వాటి బారినపడి పలువురు చిన్నారులు, మహిళలు గాయాలపాలయ్యారు. ఈ ఘటనల తర్వాత ఫిబ్రవరి 28న గ్రామంలో 11 శునకాలు మృతిచెందాయి. వాటికి విషమిచ్చి హతమార్చారంటూ పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జంతు సంక్షేమ సంఘం సభ్యులు పెరవలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మృతిచెందిన శునకాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను జాతీయ జంతు సంక్షేమ బోర్డు సభ్యురాలు, ఎంపీ మేనకా గాంధీ కి పంపించారు. దీనిపై స్పందించిన మేనకాగాంధీ తూర్పుగోదావరి కలెక్టర్‌ను ఆరా తీశారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు పోస్టుమార్టం చేయించారు. ఆ నివేదిక వస్తే గానీ వీధి కుక్కల మరణాలకు కారణాలు స్పష్టంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.