ముద్రగడ రీఎంట్రీ ఇస్తున్నారా?

రీఎంట్రీ కూడా వైసీపీ నుండే ఉంటుందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ముద్రగడ ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే.

Advertisement
Update:2023-05-08 11:02 IST

కాపు ఉద్యమ నేతగా బాగా పాపులరైన ముద్రగడ పద్మనాభం రాబోయే ఎన్నికల్లో మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారా? కాపు సామాజికవర్గంలో ఇప్పుడు ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. ముద్రగడ మద్దతుదారులుగా ఉన్నవాళ్ళు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమనే చెబుతున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం లేదా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో పోటీ చేస్తారట. అసెంబ్లీ కాకపోతే కాకినాడ ఎంపీగా అయినా పోటీకి రెడీగా ఉన్నట్లు సమాచారం.

రీఎంట్రీ కూడా వైసీపీ నుండే ఉంటుందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ముద్రగడ ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఒకటి రెండు సార్లు ఓడిపోయారు కూడా. ఒక ఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మూడో ప్లేసులో నిలిచారు. రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా వైసీపీ తరపునే పోటీ చేయాలని మద్దతుదారుల నుండి పెద్ద ఎత్తున వచ్చిన ఒత్తిడికి ముద్రగడ కూడా సానుకూలంగా స్పందించారట.

కాపు సామాజికవర్గంలోని కొందరు ప్రముఖ నేతలు ముద్రగడను జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్ళాలని అనుకున్నా సాధ్యం కాలేదు. ఎందుకంటే తుని రైలు దహనం ఘటనలో కాపులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తేసిన తర్వాతే సీఎంను కలుస్తానని ముద్రగడ చెప్పారట. ఈ మధ్యనే ప్రభుత్వం కేసులు ఎత్తేయటం, రైల్వే కోర్టు కూడా కేసులను కొట్టేయటంతో ముద్రగడ హ్యాపీగా ఉన్నారు. అందుకనే తొందరలోనే జగన్‌తో ముద్రగడ భేటీకి అవకాశముంది. ముద్రగడ గనుక వైసీపీలో చేరి పోటీ చేస్తే బాగానే ఉంటుంది.

అయితే సమస్య ఏమిటంటే ముద్రగడకు షార్ట్ టెంపర్ ఎక్కువ. ఏదైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దాన్నుండి పక్కకు రారని చెబుతారు. ఎదుటివాళ్ళతో సర్దుకుపోయే గుణం తక్కువ కావటంవల్లే ఎవరితోను ఎక్కువకాలం ఉండలేకపోతున్నారట. ఉద్యమ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హయాంలో ముద్రగడ కుటుంబం ఎదుర్కొన్న హింసను అందరు చూసిందే. ఉద్యమంలో ముద్రగడ చేసిన రాజీలేని పోరాటం కాపుల్లో ప్రత్యేక ఇమేజ్‌ తెచ్చింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ముద్రగడ పోటీ చేస్తే గెలుపు గ్యారెంటీ అని ఆయన మద్దతుదారులు అంచనా వేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News