చంద్రబాబు ఇంకా పాత చిప్‌నే వాడుతున్నారు.. ఎంపీ మార్గాని భరత్ సెటైర్

చంద్రబాబుని టార్గెట్‌‌గా చేసుకుని కూడా మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. ఆయన ఇంకా పాత చిప్‌నే వాడుతూ అవుట్ డేటెడ్ రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.

Advertisement
Update:2023-05-12 11:37 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా పాత చిప్‌నే వాడుతూ అవుట్ డేటెడ్ రాజకీయాలు చేస్తున్నాడని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెటైర్ వేశారు. ఏపీలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తుండటంపై భరత్ మండిపడ్డారు. రైతుల కోసం రాత్రి వేళల్లో పర్యటిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించిన మార్గాని భరత్.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.

చంద్రబాబుని టార్గెట్‌‌గా చేసుకుని కూడా మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. ఆయన ఇంకా పాత చిప్‌నే వాడుతూ అవుట్ డేటెడ్ రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 300 కరువు మండలాల్ని ప్రకటిస్తే కనీసం ఒక్క మండలంలో కూడా చంద్రబాబు పర్యటించలేదని గుర్తు చేశారు. రైతులను చంద్రబాబు ఏరోజూ ఆదుకునే ప్రయత్నం చేయలేదని.. కానీ వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మార్గాని భరత్ స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్‌కి రైతులు, పంటల గురించి ఏమీ అవగాహన లేదని ఆయన మాటల్లోనే తెలిసిపోతోందని మార్గాని భరత్ సెటైర్ వేశారు. అసలు పవన్‌కి ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) అంటే తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల వద్ద నుంచి ఎంత ధాన్యం కొనుగులు చేశారు? ఎంత మద్దతు ధర ప్రభుత్వం ఇస్తోంది? అనేదానిపై మీకు అవగాహన ఉందా? అని మార్గాని భరత్ నిలదీశారు. చివరిగా ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పవన్ కళ్యాణ్ బూట్ల కింద ఉండటాన్ని కూడా తప్పుబట్టిన ఎంపీ భరత్.. పవన్ కళ్యాణ్‌కి అసలు దేశభక్తి ఉందా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News