మోదీ అబద్ధాల ముందు బాబు బలాదూర్
దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్ కావాలా? వద్దా? అని పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన సభలో ప్రజల్ని అడిగారు ప్రధాని మోదీ.
చంద్రబాబు అసత్య ప్రచారం ఏపీలో అందరికీ తెలిసిందే. ఆంధ్రా గోబెల్స్ అనేది బాబుకి మారుపేరు. అలాంటి చంద్రబాబు కూడా ఈసారి ఎన్నికల వేళ కళ్లు తేలేయాల్సిన పరిస్థితి. మోదీ చెబుతున్న అబద్ధాల ముందు బాబు తేలిపోతున్నారు. అలాగని బాబేం తక్కువ తినలేదు. సూపర్ సిక్స్ కి మరిన్ని హామీలు జోడించి.. ఏపీ బడ్జెట్ ని మించిపోయేలా జనం చెవిలో పూలు పెట్టారు. ఇక మోదీ విషయానికొద్దాం.. 2014లో తొలిసారి జాతీయ రాజకీయాల్లో ఉధృతంగా ప్రచారం చేసిన మోదీ ఈ రేంజ్ లో అబద్ధాలు చెప్పలేదు. 2019లో ఏపీలో బీజేపీ సొంతంగా పోటీ చేయడంతో ఆయన ప్రసంగాలు పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఈసారి ఏపీకి ప్రచారం కోసం వస్తున్న మోదీ.. అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. పదేళ్లుగా మోదీ వ్యవహారం గమనిస్తున్న ప్రజలకు ఆయన చెబుతున్న మాటలు వింటే బాబు బలాదూర్ అనుకోవాల్సిందే.
దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్..
దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్ కావాలా? వద్దా? అని పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన సభలో ప్రజల్ని అడిగారు ప్రధాని మోదీ. ఈసారి ఎన్డీఏని గెలిపిస్తే దక్షిణాదిలో కూడా బుల్లెట్ రైలు వస్తుందని అన్నారాయన. నంద్యాల-ఎర్రకుంట్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరైందని, కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉందని, వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల పనులు మరింత విస్తరిస్తామని చెప్పుకొచ్చారు మోదీ. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
ఈ ప్రశ్నలకు బదులేది..
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ లో నిరాశ ఎదురైంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో మరో మోసం జరుగుతోంది. పోలవరం విషయంలో కొర్రీలు వేసి ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమయ్యేందుకు ప్రధాన కారణంగా మారింది కేంద్ర ప్రభుత్వం. వీటన్నిటినీ పక్కనపెట్టి ఇప్పుడు రాయలసీమకు వరాలు ప్రకటిస్తున్నారు మోదీ. అమరావతిలో పిడికెడు మట్టి తీసుకొచ్చి వేసిన మోదీ ఆ తర్వాత రాజధాని ఊసే మరచిపోయారు. ఏపీకి అన్ని విధాల నష్టం చేసిన ఆయన.. ఎన్నికల వేళ మాత్రం కమ్మని కబుర్లు చెబుతున్నారు. గతంలో చంద్రబాబుని తిట్టిపోసిన ఆ నోటితోనే ఇప్పుడు ఆయన పాలనను పొగుడుతున్నారు, జగన్ పై నిందలు వేస్తున్నారు మోదీ.