కొమ్మలను నరికేస్తే.. ఇక అక్కడెవరూ ఉండరు- వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
తనను ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని.. ఆ అధికారాన్ని మాత్రం తన నుంచి ఎవరూ దూరం చేయలేరన్నారు. ఇది తాను చెబుతున్న మాట కాదని.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ఆ విషయం చెబుతోందన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గంలో మరొకరిని ఇన్‌చార్జిగా నియమించడంపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తామంతా వైసీపీ నీడను పెరుగుతున్న చెట్లమన్నారు. ఆ చెట్లకు కొమ్మలు లేకుండాపోతే అక్కడ ఎవరూ నిలబడే పరిస్థితి ఉండదన్నారు. పార్టీని సమన్వయం చేసుకునేందుకు సమన్వయకర్తను నియమించి ఉంటారన్నారు.
తనను ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని.. ఆ అధికారాన్ని మాత్రం తన నుంచి ఎవరూ దూరం చేయలేరన్నారు. ఇది తాను చెబుతున్న మాట కాదని.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ఆ విషయం చెబుతోందన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ప్రభుత్వ పరిపాలన అంతా తానే చూస్తానన్నారు. బ్లాక్‌మెయిల్ చేసే వారి గురించి పార్టీ నాయకత్వమే చూసుకుంటుందన్నారు.
ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవికి వైసీపీ టికెట్ కష్టమన్న ప్రచారం నడుస్తోంది. ఆమెకు పోటీగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ రంగంలోకి దింపింది. అప్పటి నుంచి శ్రీదేవి అడపాదడపా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెట్లకు కొమ్మలు నరికేస్తే అక్కడ ఎవరూ ఉండే పరిస్థితి ఉండదంటూ మాట్లాడడం చర్చనీయాంశమైంది.