మారణాయుధాలతో దాడి.. మా వద్ద ఆధారాలున్నాయ్.. - మాచర్ల అల్లర్లపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
చంద్రబాబు, నారా లోకేష్‌లు కావాలనే మాచర్లకు ఫ్యాక్షన్ నేతలను పంపి గొడవలు సృష్టిస్తున్నారన్నారు. టీడీపీ అసలు రంగు ఇదేనని ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారని, ఇలాంటి దాడులతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడేది లేదని స్పష్టం చేశారు.
ప్రచార కార్యక్రమం కోసం ఎవరైనా రాడ్లు, కర్రలు, మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారా అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పార్టీ జెండాల కర్రలకు ఇనుప రాడ్లు తగిలించుకొని టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు మాచర్లలో భయానక వాతావరణం సృష్టించారని ఆయన మండిపడ్డారు. శనివారం మాచర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పల్నాడులో చెలరేగిన హింసాత్మక ఘర్షణలను ఖండించారు.
మాచర్లలో అల్లర్లకు టీడీపీ కుట్ర..
మాచర్లలో అల్లర్లు, దాడులకు టీడీపీ కుట్రలు చేసిందని, టీడీపీ చేపడుతున్న ఓ కార్యక్రమంలో భాగంగా పథకం ప్రకారం వైఎస్సార్ పీపీ కార్యకర్తలపై దాడులు చేశారని పిన్నెల్లి విమర్శించారు. టీడీపీ ఫ్యాక్షన్, బెదిరింపు రాజకీయాలపై ఎమ్మెల్యే పిన్నెల్లి మండిపడ్డారు. శుక్రవారం నాడు జరిగిన ఘటన పల్నాడులో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రజల మధ్య సామరస్యాన్ని ధ్వంసం చేసేలా ఉన్నాయన్నారు. వైఎస్సార్ సీపీ ని ఎదుర్కొలేక టీడీపీ నాయకులు దాడులతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
వారి వాహనాలకు వారే నిప్పు పెట్టుకున్నారు..
పల్నాడులో ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పట్టు కోల్పోయిన టీడీపీ.. దౌర్జన్యంతో దాడులు చేస్తోందని, సొంత వాహనాలకు నిప్పు పెట్టి జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం వైఎస్సార్ సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌లు కావాలనే మాచర్లకు ఫ్యాక్షన్ నేతలను పంపి గొడవలు సృష్టిస్తున్నారన్నారు. టీడీపీ అసలు రంగు ఇదేనని ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారని, ఇలాంటి దాడులతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డయింది..
టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వజమెత్తారు. కార్లు, ఇళ్లను ధ్వంసం చేయడంతోపాటు ప్రజలపై దాడికి పాల్పడేలా టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. "ప్రజా ఆస్తులు, వాహనాలు, ఇళ్ల ధ్వంసానికి టీడీపీదే బాధ్యతని చెప్పారు. ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డయ్యిందని, దాడుల వీడియా ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. ఆ ఆధారాలన్నీ పోలీసులకు అందిస్తామని, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు.