అసెంబ్లీలో నేనేంటో చూపిస్తా.. కోటంరెడ్డి పరోక్ష హెచ్చరిక
ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రభుత్వంపై నిందవేసి పార్టీకి దూరం జరిగిన రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది ప్రతిపక్ష టీడీపీ. అయితే ఇప్పుడు వైసీపీకి రెబల్ ఎమ్మెల్యేలతో కూడా ముప్పు పొంచి ఉంది. పార్టీకి దూరం జరిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన కార్యాచరణ ప్రకటించారు. నెల్లూరు రూరల్ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి గడువు కోరతానన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రభుత్వంపై నిందవేసి పార్టీకి దూరం జరిగిన రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ నేతల్ని నిలువరించినంత ఈజీగా కోటంరెడ్డిని కూడా కూర్చోబెట్టడం కుదరదని తెలుస్తోంది. తాను ప్రతిపక్షంలో ఉండగా నెల్లూరులో ఉన్న సమస్యలు, వైసీపీ అధికారంలోకి వచ్చినా పరిష్కారం కాలేదని అంటున్నారాయన. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలంటున్నారు.
జలదీక్ష..
ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలకు కోటంరెడ్డి పిలుపునిచ్చినా, ఎమ్మల్సీ ఎన్నికల కోడ్ కారణంగా హడావిడి చేయలేకపోయారు. ఇక నియోజకవర్గ సమస్యలపై ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. ఆలోపు పొట్టేపాళెం కలుజు వంతెన సమస్యకు పరిష్కారం చూపకపోతే ఏప్రిల్ 6వ తేదీ జలదీక్ష మొదలు పెడతానన్నారు. కలుజు వద్ద నీటి ప్రవాహంలో ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చుని ఉంటానని చెప్పారు. 9 గంటలసేపు నీళ్లలో కూర్చుని నిరసన తెలుపుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన తర్వాత కొన్నిరోజులు కోటంరెడ్డి ప్రెస్ మీట్లకు మంచి ఊపు ఉండేది. నాయకులు కూడా ఆయన వెంటనే ఉన్నారు. ఆ తర్వాత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక్కొక్కరినీ తనవైపు తిప్పుకుంటున్నారు. కార్పొరేటర్లు, కోటంరెడ్డి వల్ల నామినేటెడ్ పదవులు పొందినవాళ్లు కూడా ఆయనకు దూరమయ్యారు. టీడీపీలో చేరకుండానే కోటంరెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన వ్యక్తిగత బలం నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ దశలో అసెంబ్లీ వేదికగా ఆయన ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు.