జగన్ నన్ను గుర్తించలేదు.. మరో ఎమ్మెల్యే సన్నాయి నొక్కులు

దురదృష్టవశాత్తు సీఎం జగన్ తనను గుర్తించలేదన్నారు పార్థసారథి. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు.

Advertisement
Update:2023-12-29 08:48 IST

వైనాట్ 175 అంటూ సీఎం జగన్ ఓవైపు కాన్ఫిడెంట్ గా ఎన్నికల బరిలో దిగాలనుకుంటే.. సొంత పార్టీ నుంచే అసంతృప్త స్వరాలు వినపడుతున్నాయి. చాలా చోట్ల ఎమ్మెల్యేల మార్పు తప్పదని తేలిపోయింది. ఆఖరికి మంత్రులకు కూడా కొన్నిచోట్ల సొంత స్థానాలు దక్కే పరిస్థితి లేదు. ఈ దశలో మరికొంతమంది పాత లెక్కలు బయటకు తీస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సామాజిక సాధికార యాత్రలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను గుర్తించలేదని బాధపడ్డారు.

వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన పార్థసారథికి జగన్ టీమ్ లో మాత్రం చోటు దొరకలేదు. తొలిదఫా లేదు, రెండో దఫా కూడా మంత్రి వర్గంలో అవకాశం రాలేదు. దీంతో సీనియర్ నేతగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. అడపాదడపా తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నా.. తాజాగా వైసీపీ యాత్రలోనే ఆయన బయటపడటం విశేషం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధికారం ఇచ్చామంటూ సాధికార యాత్ర చేపట్టింది వైసీపీ. ఈ యాత్రలోనే ఆయన తనకు అన్యాయం జరిగిందని పార్థసారథి స్టేజ్ పై చెప్పడం వైసీపీ నాయకులకు కూడా మింగుడుపడలేదు.

ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు పార్థసారథి. ఈసారి ఆయనకు టికెట్ వస్తుందో లేదో అనే అనుమానం కూడా ఉంది. ఆల్రడీ విడతలవారీగా ఇన్ చార్జ్ లను ప్రకటిస్తున్నారు సీఎం జగన్. ఈ దశలో పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. దురదృష్టవశాత్తు సీఎం జగన్ తనను గుర్తించలేదన్నారాయన. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యేని కాదని సేవకుడిగా ఉంటానని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.

Tags:    
Advertisement

Similar News