అమరావతి శంకుస్థాపనకు ఆనాడు జగన్ ఎందుకు దూరంగా ఉన్నారంటే..?

రాజధానిగా అమరావతిని వైఎస్‌ జగన్‌ సమర్ధించలేదని, అందుకే ఆనాడు ఆయన శంకుస్థాపనకు రాలేదని వివరించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్‌కి మాత్రమే కట్టుబడి ఉంటామని జగన్ చెప్పారని గుర్తు చేశారు.

Advertisement
Update:2022-10-29 14:26 IST

మూడు రాజధానులపై టీడీపీ చేసే ప్రధాన కంప్లయింట్ ఒక్కటే. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్ ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ప్రతిపక్షనేతగా అమరావతి రాజధానికి అభ్యంతరం తెలపని జగన్, సీఎం అయ్యాక ఎందుకిలా మారిపోయాడని ప్రశ్నిస్తుంటారు. దీనికి ఇప్పుడో లాజిక్ చెప్పారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. గతంలో కూడా అమరావతి రాజధానికి జగన్ సుముఖత చూపలేదని గుర్తు చేశారు కరుణాకర్ రెడ్డి.

అమరావతి శంకుస్థాపనకు అందుకే రాలేదు..

అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ప్రధాని హోదాలో మోదీ వచ్చారు కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత జగన్ మాత్రం రాలేదు. రాజధానిగా అమరావతిని వైఎస్‌ జగన్‌ సమర్ధించలేదు కాబట్టే ఆయన అమరావతి శంకుస్థాపనకు రాలేదని వివరించారు ఎమ్మెల్యే భూమన. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్‌కి మాత్రమే కట్టుబడి ఉంటామని జగన్ అన్నారని, కానీ కమిటీ రిపోర్ట్ రాకుండానే చంద్రబాబు అమరావతి రాజధాని అంటూ హడావిడి చేశారని చెప్పారు. ఆనాడు జరిగిన శంకుస్థాపనకు అర్థం లేదని, అందుకే అమరావతి వ్యర్థంగా మారిందని విమర్శించారు.

మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన తర్వాత తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన జరిగింది. కృష్ణాపురం జంక్షన్ నుంచి గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా తుడా కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రజలనాడి తెలుసుకోకుండా మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న విషప్రచారాన్ని సీమవాసులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు గుండెల్లో దడ పుట్టేలా తిరుపతిలో సీమ ఆత్మ గౌరవ సభ జరిగిందన్నారు భూమన.

మామకే కాదు సీమకు కూడా వెన్నుపోటు..

ఈ గడ్డపై పుట్టిన చంద్రబాబు సీమకు అన్యాయం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే భూమన. సొంత మామకే కాదు, గద్దెనెక్కించిన సీమకు కూడా ఆయన వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడుకు పెంచిన కృష్ణా జలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News