మంత్రి రెచ్చగొడుతున్నారా?
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేసిన ప్రకటన చూస్తుంటే ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసును రెచ్చగొట్టి పార్టీ నుండి బయటకు వెళ్లిపోయేట్లు చేయాలనే వ్యూహమే కనబడుతోంది.
రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై ఇప్పటికే మండిపోతున్న రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసును మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మరింతగా రెచ్చగొడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు పిల్లి మరోవైపు చెల్లుబోయిన ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని రెండు వైపులా వాయించేస్తున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తాను లేదా తన కొడుకు సూర్యప్రకాష్ పోటీ చేయాని పిల్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో చెల్లుబోయినే మళ్ళీ పోటీ చేస్తారని జిల్లా ఇన్‌చార్జి, ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు.
ఎంపీ చేసిన ప్రకటనతో పిల్లికి బాగా మండిపోయింది. ఈ నేపథ్యంలోనే జగన్‌పై తిరుగుబాటు చేయటానికి కూడా రెడీ అయిపోయారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించటమే తిరుగుబాటుకు సంకేతాలు. పార్టీ కన్నా క్యాడరే తనకు ముఖ్యమని పిల్లి గట్టిగా చెబుతున్నారు. పిల్లి వ్యాఖ్యలతో నిజానికి మంత్రి మౌనంగా ఉండాలి. ఎందుకంటే మంత్రినే పోటీ చేయించేందుకు జగన్ రెడీ అయ్యారు. కాబట్టి టికెట్ విషయంలో మంత్రికి ఎలాంటి ఢోకాలేదు.
సమస్యంతా పిల్లితోనే. కాబట్టి పిల్లి ఏమిమాట్లాడినా, పార్టీపై తిరుగుబాటు చేసినా జగనే చూసుకుంటారు. కానీ మంత్రి ఊరుకోకుండా పిల్లిని బాగా రెచ్చగొడుతున్నారు. రాబోయే మూడు ఎన్నికల్లో కూడా తానే పోటీ చేయబోతున్నట్లు చెల్లుబోయిన ప్రకటించారు. నిజానికి ఇప్పుడీ ప్రకటన అవసరమేలేదు. గతంలో శాసన మండలి రద్దు తీర్మానం సందర్భంగా పిల్లి కోరిక మేరకే జగన్ రాజ్యసభకు పంపినట్లు గుర్తుచేశారు. అప్పట్లో పిల్లి సమక్షంలోనే రాబోయే మూడు ఎన్నికల్లో తననే జగన్ అభ్యర్థిగా ప్రకటించారని మంత్రి ఇప్పుడు చెప్పారు.
నిజానికి పిల్లికి లేదా పోటీకి సంబంధించిన విషయాల్లో మంత్రి నోరుతెరవకుండా ఉంటేనే బాగుంటుంది. మంత్రి ఏ ప్రకటన చేసినా పిల్లిని రెచ్చగొట్టినట్లే అవుతుంది. వివాదాన్ని జగన్ ఏ విధంగా పరిష్కరిస్తారో గమనిస్తుంటే సరిపోతుంది. పార్టీలో ఉండదలచుకుంటే జగన్ చెప్పినట్లు పిల్లి వినాల్సందే. పార్టీలో ఉండటం ఇష్టంలేకపోతే పిల్లి బయటకు వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి జరిగిన తర్వాత తన పోటీ విషయంలో జగన్ ఏమి హామీ ఇచ్చారనే విషయాన్ని చెల్లుబోయిన మాట్లాడినా ఇబ్బందుండదు. కానీ అలాకాకుండా చెల్లుబోయిన చేసిన ప్రకటన చూస్తుంటే పిల్లిని రెచ్చగొట్టి పార్టీ నుండి బయటకు వెళ్లిపోయేట్లు చేయాలనే వ్యూహమే కనబడుతోంది.