ఆడియో మార్చి అభాండాలు.. మహిళా మంత్రి ఆవేదన..!

గతంలో కూడా వైసీపీ నేతల ఆడియోలు చాలానే బయటకొచ్చాయి. అప్పుడు కూడా సేమ్ ఆన్సర్. మా వాయిస్ మిమిక్రీ చేశారు, మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారంటూ మంత్రులుగా ఉన్న నేతలు తెగ ఇదైపోయారు.

Advertisement
Update:2023-03-14 08:01 IST

“డబ్బులు పంచినట్టు లిస్ట్ ఉంది, అందులో సంతకాలు తీసుకున్నారా, డబ్బులు అందాయో లేదో చెక్ చేసుకున్నారా..?” ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల ముందు మహిళా మంత్రి ఉష శ్రీచరణ్ వీడియో ఒకటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియో తనదేనని, కానీ అందులో వినిపించిన ఆడియో మాత్రం తనది కాదని అంటున్నారామె. తనపై అభాండాలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. తానంటే ఓర్వలేనివారు ఇలా మార్ఫింగ్ ఆడియోని ప్రచారంలోకి తెచ్చారని చెప్పారు. బీసీ మహిళ మంత్రిగా ఎదగడం ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదని ఆరోపించారు.

గతంలో కూడా వైసీపీ నేతల ఆడియోలు చాలానే బయటకొచ్చాయి. అప్పుడు కూడా సేమ్ ఆన్సర్. మా వాయిస్ మిమిక్రీ చేశారు, మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారంటూ మంత్రులుగా ఉన్న నేతలు తెగ ఇదైపోయారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరారు ఉష శ్రీచరణ్. తన వాయిస్ ని మార్చి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆమె వాపోయారు. ఆమెను బర్తరఫ్ చేయాలంటూ సీపీఐ నేతలు డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు.

గతంలో రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు వివాదం సృష్టించాయని గుర్తు చేశారామె. ఇటీవల తాను కొనుక్కున భూమిని కూడా కబ్జా అంటూ అభాండాలు వేశారన్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా, మెజార్టీపై పార్టీ నాయకులతో చర్చిస్తుండగా వీడియో తీసి, దానికి వాయిస్ మార్చారన్నారు ఉష శ్రీచరణ్. టీడీపీ నేతలు ఇంతటి నీచానికి దిగజారడం సిగ్గుచేటన్నారామె.

కురుబ సామాజిక వర్గానికి చెందిన తనపై తప్పుడు ప్రచారం చేస్తూ టీడీపీ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు మంత్రి. వెనుకబడిన కులాలకు చెందిన వారు పదవుల్లో ఉండి ఏదైనా మాట్లాడితే అది నచ్చని కొన్ని చానళ్లు, కొన్ని పత్రికలు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. మార్గదర్శి చిట్‌ ఫండ్‌ వ్యవహారంలో రామోజీరావుపై కేసులు కూడా నమోదయ్యాయని, దాని గురించి ఎవరైనా, ఎక్కడైనా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారామె.

Tags:    
Advertisement

Similar News