పవన్‌.. పార్టీని అమ్మేశాడు.. జనసైనికులు ఈ విషయం గుర్తించాలి

పురందేశ్వరికి అంత ఇష్టం ఉంటే టీడీపీలో చేరితే మంచిదని సూచించారు. ఏపీలో మద్యం అక్రమాలు ఉన్నట్టుగా అనిపిస్తే సీబీఐతో విచారణ చేయించుకోవాలన్నారు.

Advertisement
Update:2023-11-10 20:14 IST

పవన్‌ కల్యాణ్‌ పార్టీని అమ్మేశాడని, జనసైనికులు ఆ విషయాన్ని గుర్తించాల‌ని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పవన్‌ కల్యాణ్‌కి తెలంగాణలో ఒక పార్టీని నుంచి, ఏపీలో మరో పార్టీ నుంచి స్క్రిప్టు వస్తుందని, దాన్నే చ‌దివి వినిపిస్తాడ‌న్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయని, గత ఎన్నికలలో కూడా ఒప్పందం మేరకే వేర్వేరుగా పోటీ చేశాయ‌ని చెప్పారు. అబద్ధాలు సృష్టించి ఎల్లో మీడియాలో ప్రచారం చేయడమే టీడీపీ, జనసేన పని అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భయం సృష్టించాలనేది వారి ప్లాన్‌ అని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఆ విషయంలో టీడీపీకి ఉన్నంత స్కిల్‌ ఎవరికీ లేదు..

చిత్తూరు డెయిరీని చంద్రబాబు సర్వనాశనం చేశారని, మ్యాక్స్‌ చట్టం తెచ్చి తన మనుషులకు డెయిరీలను కట్టబెట్టారని మంత్రి సీదిరి విమర్శించారు. సంగం, విశాఖ, కృష్ణా డెయిరీలను తన వారి చేతిలో పెట్టారన్నారు. ప్రభుత్వానికి చెందిన సంగం డెయిరీ ధూళిపాళ్ల నరేంద్రకు ఎలా వెళ్లిందని మంత్రి నిలదీశారు. 73 ఎకరాల భూములు సంగం డెయిరీకి ఉండేద‌ని, ఆ భూములపై రూ.150 కోట్ల వరకు అప్పు తెచ్చుకున్నారని చెప్పారు. ధూళిపాళ్ళ నరేంద్ర కబ్జా చేసిన భూములు, డెయిరీలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడంలో టీడీపీ వారికి ఉన్నంత స్కిల్‌ మరెవరికీ లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను దోచుకునే టీడీపీ నేతలు తమపై ఆరోపణలు చేయడమేమిటని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు మండిపడ్డారు.

‘చంద్ర’ముఖిలా మారిపోయిన పురందేశ్వరి..

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మద్యం బ్రాండ్లపై ఆరోపణలు చేసేముందు అవన్నీ చంద్రబాబు పర్మిషన్‌తో వచ్చినవేనన్న విషయం గుర్తించాలని మంత్రి సీదిరి చెప్పారు. కాబట్టి మద్యం విషయంలో ఏవైనా అడగాలనుకుంటే ఆమె చంద్రబాబునే అడగాలన్నారు. బీజేపీలో ఉన్న పురందేశ్వరి చంద్రబాబుకు వంతపాడటం చూసి.. బీజేపీలో ఉన్న క్యాడరే ఆమెతో విభేదిస్తున్నారని గుర్తుచేశారు. పురందేశ్వరికి అంత ఇష్టం ఉంటే టీడీపీలో చేరితే మంచిదని సూచించారు. ఏపీలో మద్యం అక్రమాలు ఉన్నట్టుగా అనిపిస్తే సీబీఐతో విచారణ చేయించుకోవాలన్నారు. టీడీపీకి, చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతూ పురందేశ్వరి ‘చంద్ర’ముఖిలా మారిపోయారని మంత్రి ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News