మళ్లీ తిరుమలకు రోజా.. ఈసారి బర్త్ డే దర్శనం

తన కుమార్తె సైంటిస్ట్ అవ్వాలని ఆశపడుతోందని చెప్పారు రోజా. తన కొడుకు కానీ, కూతురు కానీ సినిమాల్లోకి వస్తానంటే కచ్చితంగా వారిని సపోర్ట్ చేస్తానని అన్నారు.

Advertisement
Update:2022-11-17 13:10 IST

పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం, అది కూడా వీఐపీ దర్శనం, అందులోనూ సకుటుంబ సపరివార సమేతంగా, జబర్దస్త్ నటులు ఎక్స్ ట్రా.. అందరికీ ఆ దర్శన భాగ్యం లభించడం కష్టం. కానీ అమాత్యులు తలుచుకుంటే కుదరకుండా పోతుందా. అందుకే మంత్రి రోజాకి ఆ దర్శనభాగ్యం లభించింది. పుట్టినరోజునాడే కాదు, వారానికోసారి ఇలాంటి దర్శనం రోజాకు లభిస్తుంటుంది. నెలలో నాలుగు సార్లు తిరుమల వచ్చి వీఐపీ దర్శనం చేసుకుని వెళ్తుంటారామె. వైసీపీ హయాంలో అత్యధికంగా స్వామివారి వీఐపీ సేవలో పాల్గొన్న నాయకుల లిస్ట్ తీస్తే కచ్చితంగా రోజా పేరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఊరిలో గుడికి వెళ్లినట్టుగా ఆమె ఏడుకొండలు ఎక్కేస్తుంటారు. ఆమధ్య నగరి నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ జిల్లాలోనే ఉంచాలని, ఆయన తమ ఇలవేల్పు అని రోజా పట్టుబట్టారు, అయినా కుదర్లేదనుకోండి, శ్రీవారంటే ఆమెకు అంత భక్తి.

ఆ భక్తి సంగతి పక్కనపెడితే వారానికోసారి ఊరిలో దేవుడి గుడికి వెళ్లినట్టు తిరుమలకు రోజా మందీమార్బలంతో కొండపైకి రావడంపై చాలామంది భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమధ్య మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 70 మందిని వెంట బెట్టుకుని వీఐపీ దర్శనం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇక రోజా సంగతి చెప్పనక్కర్లేదు. వారానికోసారి వీఐపీ దర్శనం, ఇప్పుడు జబర్దస్త్ టీమ్ సహా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. నాయకులు ఇలా వారానికోసారి వస్తుంటే, సామాన్య భక్తులు రోజుల తరబడి క్యూలైన్లలో మగ్గిపోవాలా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

ఇక తిరుమల దర్శనానికి వచ్చినప్పుడల్లా రోజా రాజకీయాలు మాట్లాడకుండా ఉండలేరు. ఓవైపు గోవిందా అంటూనే, మరోవైపు వైరి వర్గాలకు చీవాట్లు కూడా పెడుతుంటారు రోజా. అయితే ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా కుమార్తె తెరంగేట్రం గురించి ముచ్చటించారు. తన కుమార్తె సైంటిస్ట్ అవ్వాలని ఆశపడుతోందని చెప్పారు. తన కొడుకు కానీ, కూతురు కానీ సినిమాల్లోకి వస్తానంటే కచ్చితంగా వారిని సపోర్ట్ చేస్తానని అన్నారు రోజా. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో ఆమెకు శత్రువులు పెరిగిపోతున్నారని వినికిడి. ఇటీవల ఓ గ్రామ సచివాలయం ఓపెనింగ్‌కి కూడా ఆమెను రాకుండా చేసేందుకు తాళం వేసి తమాషా చూశారు సొంత పార్టీలోని నేతలు. ఈ చికాకులన్నిటితో.. ఆమెకు కొండపైనే కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుందేమో. అందుకే వారానికోసారి రోజా వీఐపీ కోటాలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

Tags:    
Advertisement

Similar News