పవన్ కల్యాణ్ పై రోజా సింపతీ.. ఎందుకంటే..?

పవన్ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. గతంలో పీఆర్పీని ఎలా మానసికంగా దెబ్బతీశారో, ఇప్పుడు జనసేనను కూడా అలాగే చేయాలనుకుంటున్నారని ఆరోపించారు రోజా .

Advertisement
Update:2023-02-27 08:30 IST

అవకాశం వస్తే పవన్ కల్యాణ్ పై చెలరేగిపోతుంటారు మంత్రి రోజా. పవన్ కూడా అదే స్థాయిలో రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో పవన్ వర్సెస్ రోజా.. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది. అయితే తాజాగా పవన్ పై రోజా సింపతీ చూపిస్తున్నారు. ఆయనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అంటున్నారు. ఇంతకీ రోజా వ్యాఖ్యలకు కారణం ఏంటి..? పవన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నవారిపై ఆమెకు ఎందుకంత కోపం..?

పవన్ కల్యాణ్ పై ఇటీవల ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం తీవ్ర కలకలం రేపింది. ఆయనకు తెలంగాణ నుంచి వెయ్యికోట్ల ప్యాకేజీ అందిందని వచ్చిన వార్తపై పవన్ కూడా స్పందించలేదు. గతంలో తనను ప్యాకేజీ స్టార్ అన్నవారిని చెప్పుతో కొడతానంటూ బహిరంగంగా చెప్పు చూపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ కథనం తర్వాత మాత్రం ఆయన నోరు మెదపలేదు. పవన్ కేవలం టీడీపీతో మాత్రమే కలసి వెళ్లేందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందుకే ఆయనపై ప్యాకేజీ వార్తలు రాశారంటున్నారు మంత్రి రోజా. పవన్ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. గతంలో పీఆర్పీని ఎలా మానసికంగా దెబ్బతీశారో, ఇప్పుడు జనసేనను కూడా అలాగే చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.

పిల్లిబిత్రి లోకేష్..

నారా లోకేష్ పిల్లిబిత్రిగాడు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి రోజా. లోకేష్ పాదయాత్రకు జనాలు రావడానికే భయపడుతున్నారని, యువత పారిపోతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పాదయాత్రలో 10 మంది నాయకులు కూడా లేరని, అది ఫెయిల్యూర్‌ యాత్ర అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి నందమూరి కుటుంబం గుర్తుకురాలేదని, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వారు గుర్తొస్తారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీని లాక్కున్న దొంగలని, ఆ పార్టీ పెట్టిన వ్యక్తి మనవడిని లోకేష్ రాజకీయాల్లోకి ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు. టీడీపీతో ఉండాలని పవన్‌కల్యాణ్‌ ను ఆంధ్రజ్యోతి ద్వారా బ్లాక్‌ మెయిల్‌ చేయిస్తున్నారని ఆరోపించారు.

దమ్ముంటే చిత్తూరు జిల్లాలో పోటీ చెయ్..

లోకేష్ కి దమ్ముంటే చిత్తూరు జిల్లానుంచి పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు మంత్రి రోజా. చిత్తూరు జిల్లాకు వచ్చి స్థానిక నాయకులపై అవాకులు చెవాకులు పేలుతున్న లోకేష్ టీడీపీ గెలుపుపై అంత ధీమా ఉంటే.. ఇక్కడినుంచే పోటీ చేయాలన్నారు.

Tags:    
Advertisement

Similar News