స్టాలిన్ సార్ థ్యాంక్యూ.. మంత్రి రోజా ట్వీట్
ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా అని పొగడ్తల వర్షం కురిపించారు. స్టాలిన్ మానవతా దృక్పథానికి తాను కృతజ్ఞురాలినని చెప్పారు రోజా.
ఏపీ మంత్రి రోజా తమిళనాడు సీఎం స్టాలిన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా అని పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన మానవతా దృక్పథానికి తాను కృతజ్ఞురాలినని చెప్పారు రోజా.
ఇంతకీ ఏమైంది..?
మంత్రి రోజా ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె యోగక్షేమాలు తెలుసుకోడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ఫోన్ చేశారు. పరామర్శల అనంతరం గతంలో తనకు కూడా అలాంటి సమస్యే ఎదురైందని చెప్పారు స్టాలిన్. ఆ సమస్య వచ్చినప్పుడు తాను ఎలా అధిగమించాననే విషయాన్ని కూడా ఆమెకు వివరించారు. తన ఆరోగ్యంపై ఆయన చూపించిన శ్రద్ధకు మంత్రి రోజా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన తనకు ఫోన్ చేసిన విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ వేశారు.
మరి మిగతావారి సంగతేంటి..?
మంత్రి రోజాకు ఇంకా చాలామందే ఫోన్లు చేసి ఉంటారు, పరామర్శించి ఉంటారు. కానీ వారెవరి గురించి కూడా ఆమె ట్వీట్ వేయలేదు. తనకు ఫలానావారు పోన్ చేశారని కూడా చెప్పుకోలేదు. ఏపీ సీఎం జగన్, రోజాకు ఫోన్ చేశారా, పరామర్శించారా అనే విషయం కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. అదే సమయంలో స్టాలిన్ ఫోన్ విషయాన్ని మాత్రం రోజా గొప్పగా చెప్పుకున్నారు. ఆయన ప్రేమ, అభిమానం, తన ఆరోగ్య సంరక్షణకోసం ఆయన ఇచ్చిన సలహాలు తన హృదయాన్ని తాకాయని చెప్పారు రోజా. తాను ఎక్కడ ఉన్నాను, ఏమైంది, ఎప్పుడు కోలుకుని ప్రజల ముందుకొస్తాను అనే విషయాలను మాత్రం ఆమె చెప్పలేదు.