బాబుకు దమ్ముంటే ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోవాలి
చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని చెప్పారు.
ఐటీ నోటీసులు అందుకున్న చంద్రబాబు నాయుడు.. దమ్ముంటే రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోవాలని మంత్రి రోజా సవాల్ విసిరారు. తాను నిప్పు అని చెబుతున్న చంద్రబాబు.. విచారణను ఎదుర్కొని తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు విచారణ ఎదుర్కొంటాడో లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడో చూడాలంటూ ఎద్దేవా చేశారు. విజయ్ మాల్యాలా విదేశాలకు పారిపోయే అవకాశం కూడా ఉందని చెప్పారు.
విజయవాడలో గురువారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని చెప్పారు. చంద్రబాబు జైలుకెళితే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని రోజా అన్నారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయి వచ్చాడని రోజా గుర్తుచేశారు. అడ్డంగా దొరికిపోయిన ప్రతిసారీ సింపతీ డ్రామాలు ఆడటం బాబుకు అలవాటని రోజా చెప్పారు. చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతీ రాలేదని, బాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని చెప్పారు. 2019లో ఎన్నికల ముందు మోడీ తనను అరెస్ట్ చేయిస్తారంటూ అప్పుడు కూడా చంద్రబాబు సింపతీ డ్రామా ఆడారని గుర్తుచేశారు.
చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేయాలని, ముడుపుల కేసులో సీబీఐ, ఈడీ ఆయన్ని విచారించాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. లోతైన విచారణ చేస్తే రూ.118 కోట్లు మాత్రమే కాదని, ఇంకా చాలా అవినీతి బయటికొస్తుందని చెప్పారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ని అరెస్ట్ చేసిన క్రమంలో చేపట్టిన విచారణలో రూ.2 వేల కోట్ల మేరకు స్కామ్ జరిగిందని వెల్లడైందన్నారు. అందులో ఇప్పటికి కొంత మాత్రమే బయటపడిందని మంత్రి రోజా చెప్పారు.