24 సీట్లకు నిన్ను ఎవరాపారు పవన్‌? - మంత్రి రోజా ఎద్దేవా

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఉమ్మ‌డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 అసెంబ్లీ సీట్లలోనూ పోటీ చేశారని మంత్రి రోజా గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పవన్‌ మాత్రం మధ్యలో ఉన్న 9ని తీసేసి 24 సీట్లతో సరిపెట్టుకోవడం కంటే సిగ్గుచేటు ఇంకోటి లేదని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2024-03-02 16:32 IST

పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రోజా మరోసారి సెటైర్లు పేల్చారు. మనల్నెవడ్రా ఆపేది అంటూ తిరిగిన పవన్‌ కల్యాణ్‌ని ఇప్పుడు 24 సీట్లకు ఎవరు ఆపారని ఆమె ప్రశ్నించారు. నిన్ను ఆపింది చంద్రబాబా? లేక ప్యాకేజీనా? అంటూ నిలదీశారు. తాము ప్యాకేజీ స్టార్‌ అంటే గింజుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో 24 సీట్లకు మాత్రమే అంగీకరించడం అంటే.. దానర్థం ఏమిటని ప్రశ్నించారు. శనివారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆయన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఉమ్మ‌డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 అసెంబ్లీ సీట్లలోనూ పోటీ చేశారని మంత్రి రోజా గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పవన్‌ మాత్రం మధ్యలో ఉన్న 9ని తీసేసి 24 సీట్లతో సరిపెట్టుకోవడం కంటే సిగ్గుచేటు ఇంకోటి లేదని ఎద్దేవా చేశారు. జనసేన ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ కార్యకర్తలు తలెత్తుకోలేకపోతున్నారని చెప్పారు. అలాంటివారంతా వైసీపీలో చేరాలనుకుంటే సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. వైసీపీలో జగన్‌ పాలనలో సగర్వంగా తలెత్తుకునే పరిస్థితి నాయకుడికి గాని, కార్యకర్తకు గాని ఉంటుందని మంత్రి తెలిపారు.

ఇప్పటివరకు జనసేన కార్యకర్తలు వాడి జెండా మొయ్యి.. వీడి జెండా మొయ్యి.. వీడి అజెండాను ప్రచారం చెయ్యి.. వాడి అజెండాను ప్రచారం చెయ్యి అంటూ ఆదేశించిన పరిస్థితినే చూశారన్నారు. వాడి గొప్పలు చెప్పు.. వీడి గొప్పలు చెప్పు.. వాడి కండువా కప్పుకో.. వీడి కండువా కప్పుకో.. అంటూ సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించారని విమర్శించారు. కానీ జగన్‌ అలా తన నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదని, వైసీపీ జెండా, అజెండా ఎప్పుడూ ఒక్కటేనని రోజా సగర్వంగా చెప్పారు. జగన్‌ లాంటి దమ్మున్న నాయకుడి నాయకత్వంలో పనిచేస్తే ప్రజల్లో గౌరవం కూడా ఉంటుందని తెలిపారు.

జనసేనలో, టీడీపీలో అవమానాలకు, అన్యాయాలకు గురవుతున్నవారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని సూచించారు. జగన్‌ హయాంలో రాజకీయంగా ఎదిగేందుకు వారికి కూడా అవకాశం ఉంటుందని రోజా చెప్పారు. కానీ అదే పార్టీల్లో కొనసాగితే ఇతరుల జెండాలు, కండువాలు మోస్తూ కూలీలుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News