ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు..
జగన్ ని అథఃపాతాళానికి తొక్కేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న పవన్ కల్యాణ్.. తాను పాతాళంలో ఉన్నాననే విషయం మరచిపోతున్నారని విమర్శించారు మంత్రి రోజా.
తాడేపల్లి గూడెం జెండా సభలో పవన్ కల్యాణ్ తన పరువు తానే తీసుకున్నారు. మిగిలున్నదాన్ని వైసీపీ నేతలు పూర్తిగా తీసేశారు. పార్టీకి మండల కమిటీలు లేవు, బూత్ కమిటీలు లేవు అంటూ కార్యకర్తల్ని తిడుతున్న పవన్.. ఒకసారి తన తప్పు తెలుసుకోవాలని అన్నారు మంత్రి రోజా. పార్టీలో కమిటీలు వేయాల్సింది ఎవరని ప్రశ్నించారు. పార్టీ అధినేతగా ఉంటూ సంస్థాగత నిర్మాణాన్ని గాలికొదిలేసిన పవన్ ఇప్పుడు తప్పంతా కార్యకర్తలదే అన్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ అధినేతగా ఆయన ఫెయిలయ్యారని కౌంటర్ ఇచ్చారు.
గట్టిగా అరిస్తే..
పార్టీ పెట్టి పదేళ్లైనా.. 24 సీట్లకే పరిమితమై పోటీ చేసే దుస్థితిలో ఉన్నారంటూ పవన్ పై సెటైర్లు పేల్చారు మంత్రి రోజా. పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరిందని అందుకే జెండా సభలో సీఎం జగన్ పై విమర్శలు చేశారని అన్నారు. పార్టీ పెట్టి పదేళ్లైనా పొత్తులో ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని స్టేజ్‌లో పవన్ ఉన్నారని అన్నారు. ఆ ఫ్రస్టేషన్ లోనే ఆయన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, సీఎం జగన్‌ను విమర్శించే అర్హత పవన్ కు లేదన్నారు రోజా.
పాతాళంలో ఉన్నది నువ్వే..
జగన్ ని అథఃపాతాళానికి తొక్కేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న పవన్ కల్యాణ్.. తాను పాతాళంలో ఉన్నాననే విషయం మరచిపోతున్నారని విమర్శించారు మంత్రి రోజా. చంద్రబాబు మాయలో పూర్తిగా పడిపోయారని, ఆయనకు ఊడిగం చేస్తూ పవన్ పాతాళంలో కూరుకుపోయారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినప్పుడే పవన్ పరిస్థితి ఏంటో జనానికి తెలిసొచ్చిందని, ఈసారి కూడా పవన్ కి ఓటమి ఖాయమని తీర్మానించారు.