టీడీపీ కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది.. ఫైర్ అయిన మంత్రి రోజా

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమ ఉంటే.. వాళ్లు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసే వారని.. కానీ అలా చేయకుండా ఎన్నికలకు నాలుగు నెలల ముందు నాలుగు క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఏదో గొప్ప పని చేసినట్లు టీడీపీ నాయకులు అనుకుంటున్నారని మంత్రి రోజా అన్నారు

Advertisement
Update:2022-09-07 18:04 IST

ఏపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా మరోసారి టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల విషయంలో టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆమె ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమ ఉంటే.. వాళ్లు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసే వారని.. కానీ అలా చేయకుండా ఎన్నికలకు నాలుగు నెలల ముందు నాలుగు క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఏదో గొప్ప పని చేసినట్లు టీడీపీ నాయకులు అనుకుంటున్నారని అన్నారు. మేం క్యాంటీన్లు ఏర్పాటు చేశాం.. మీరు తీసేశారు అంటూ వైసీపీపై విమర్శలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలని రోజా హితవు పలికారు. అనవరమైన విషయాల్లో కోడిగుడ్డుపై ఈకలు పీకితే చివరకు మీరు ఫూల్స్ అవుతారని టీడీపీని హెచ్చరించారు.

గుంటూరులోని గుంటూరువారి తోటలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని బుధ‌వారం ఆమె దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ల విషయంలో తెలుగు దేశం నాయకులకు చిత్త శుద్ది లేదని విమర్శించారు. సీఎం జగన్ ఒక్కరే ప్రజలకు మేలు చేయగలరని, పేదల కోసం తపించే పార్టీ వైసీపీ ఒక్కటేనని రోజా అన్నారు. కుప్పం అన్న క్యాంటీన్ వ్యవహారంలో తప్పు ఎవరిదనే విషయం అందరికీ తెలుసన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని రోజా అన్నారు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని నెల రోజుల నుంచి టీడీపీ రాజకీయం చేస్తోందని అన్నారు. ప్రతీ సారి వైసీపీని విమర్శిస్తూ టీడీపీ పబ్బం గడుపుకుంటోందని.. రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించి రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆమె జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఏపీ ప్రజలు వారిని ఆదరించరని.. చంద్రబాబు నాయుడు ఏనాడో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని మంత్రి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News