బాబు, బాలకృష్ణ.. ఇద్దరినీ ఓడిస్తాం..

టిక్కెట్ల కేటాయింపులో కొంత అసంతృప్తి సహజంగానే ఉంటుందని, అయితే త్వరలోనే దానిని అధిగమిస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. టీడీపీ – జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదని ఆయన తెలిపారు.

Advertisement
Update:2024-01-10 18:02 IST

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని మానెంపల్లి గ్రామంలో పెద్దిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినప్పటికీ అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో 99 శాతం హామీలు అమలు చేసినట్టు ఆయన చెప్పారు. సీఎం జగన్‌ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని, హిందూపురం పార్లమెంటు నుంచి బోయ–వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని ఆయన వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకేచోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

టిక్కెట్ల కేటాయింపులో కొంత అసంతృప్తి సహజంగానే ఉంటుందని, అయితే త్వరలోనే దానిని అధిగమిస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. టీడీపీ – జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదని ఆయన తెలిపారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కోల్పోయిందని ఆయన చెప్పారు. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆయన కుట్రలను అధిగమిస్తామని మంత్రి తెలిపారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే అని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల విధుల నిర్వహణలో సచివాలయ సిబ్బందిని ఉపయోగించటం లేదని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు అవగాహన లేక ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు.

Tags:    
Advertisement

Similar News