చంద్ర‌బాబుకు వ‌ణుకు పుట్టిస్తున్న పెద్దిరెడ్డి

తాజాగా కుప్పం నియోజకవర్గం నుంచి 234 మంది టీడీపీ నేతల్ని వైసీపీలో చేర్చుకున్నారు. వీరేమీ పెద్దనాయకులు కాదు, కానీ టీడీపీనుంచి వచ్చే వారికి ఆ మాత్రం ప్రయారిటీ ఇస్తున్నారు.

Advertisement
Update:2022-07-17 12:15 IST

2024లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలనే టార్గెట్ ఫిక్స్ చేశారు సీఎం జగన్. అంటే చంద్రబాబుని కూడా కుప్పంలో ఓడించాల్సిందేన‌న‌మాట. కేవలం మాటలవరకే ఇది పరిమితం కాలేదు, చేతల్లో కూడా అదే దూకుడు చూపిస్తోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తాం అనేది కేవలం వైరి వర్గాలను రెచ్చగొట్టే డైలాగ్ మాత్రమే కాదు, వారి వెన్నులో ఇప్పటినుంచే వణుకు పుట్టించేందుకు పథక రచన కొనసాగిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుప్పంలో చంద్రబాబు కూసాలు కదల్చబోతున్నారు. ముందుగా ఆయన్ను ఏకాకిని చేసి కొత్త నియోజకవర్గానికి పారిపోయేలా చేస్తున్నారు.

చేరికలతో భయపెట్టేలా..

కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. సామాజిక వర్గం వారు కావచ్చు, ఇతరత్రా కొన్ని వర్గాల్లో టీడీపీ, ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం కావొచ్చు.. కుప్పంలో టీడీపీకి ఫిక్స్‌డ్ ఓటుబ్యాంకు ఉండబట్టే, అక్కడ ప్రచారానికి వెళ్లకపోయినా చంద్రబాబు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇకపై దానికి చెక్ పెడతామంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి. ముందుగా కుప్పంలో టీడీపీని వీక్ చేసేందుకు ప్రణాళిక రచించారు. వీలైనంతమందిని టీడీపీనుంచి బయటకు తీసుకొచ్చి వైసీపీలో కలిపేస్తున్నారు. చేరికలతో వైసీపీని కుప్పంలో బలోపేతం చేస్తున్నారు.

సహజంగా చోటామోటా నాయకుల చేరికలకు మంత్రి పెద్దిరెడ్డి లాంటి వారు హాజరవ్వాల్సిన పనిలేదు. కానీ, ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. వార్డు మెంబర్ గా పోటీ చేసి ఓడిపోయినవారికి కూడా తనే కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా కుప్పం నియోజకవర్గం నుంచి 234 మంది టీడీపీ నేతల్ని వైసీపీలో చేర్చుకున్నారు. వీరేమీ పెద్దనాయకులు కాదు, కానీ టీడీపీనుంచి వచ్చే వారికి ఆ మాత్రం ప్రయారిటీ ఇస్తున్నారు. ముందుగా టీడీపీని బలహీన పరిచి, ఆ తర్వాత బాబుని గట్టిగా దెబ్బ కొట్టాలనుకుంటున్నారు

భరత్ దూకుడు..

ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పోటీ చేస్తే ఆయన ప్రత్యర్థి ఎవరనేది వైసీపీ ఫిక్స్ చేసేసింది. ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ చంద్రబాబుపై పోటీకి దిగుతారని, ఆయనకే వైసీపీ టికెట్ ఇస్తుందని ఆల్రడీ పెద్దిరెడ్డి ప్రకటించేశారు. ప్రతి చేరిక సమావేశంలోనూ భరత్ ని గెలిపించుకోవాలని ఉపదేశమిస్తున్నారు పెద్దిరెడ్డి. సో.. రెండేళ్ల ముందుగానే అక్కడ భరత్ తన గెలుపుకోసం రూట్‌ మ్యాప్ రెడీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని మట్టికరిపించిన ఉత్సాహంతో భరత్ వర్గం దూసుకెళ్తోంది.

చేరికలతో ఇప్పటికే మైండ్ గేమ్ మొదలు పెట్టింది వైసీపీ. ఈ చేరికలను చూసి మరికొంతమంది టీడీపీని వదిలిపెట్టే అవకాశముంది. అలా టీడీపీని మానసికంగా దెబ్బకొట్టి, బలహీనపరిచి, ఎన్నికలకు ముందుగానే కుప్పం చంద్రబాబుకి సరైన నియోజకవర్గం కాదు అనే భావన కలిగించాలనుకుంటున్నారు. నాయకుడే కుప్పం వదిలి పారిపోతే అది కేడర్ కి మరింత అవమానం. పోనీ కుప్పంలో నిలబడినా గెలుపు గ్యారంటీ కాదు కాబట్టి అది బాబుకి భయం. ఇలా చంద్రబాబుని ఇరుకున పెట్టబోతున్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News