రుషికొండ భవనాలపై కీలక అప్ డేట్..
వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, విశాఖను పాలనా రాజధాని చేసి ఉంటే, రుషికొండ భవనాలు మరింత హైలైట్ అయ్యేవి. ఆరెండూ జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వ హయాంలో ఆ భవనాలను ఏంచేస్తారనేది తేలాల్సి ఉంది.
రుషికొండ భవనాల విషయంలో ఆమధ్య పెద్ద గొడవ చేసింది కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొంతమంది రుషికొండకు వెళ్లి రచ్చ రచ్చ చేశారు. ఆ భవనాలకు ఎంత ఖర్చు పెట్టారు, ఎలాంటి ఫర్నిచర్ వాడారు, ఆఖరికి బాత్రూమ్ లో కమోడ్ ల డిజైన్లు, వాటి ధరలపై కూడా న్యూస్ ఛానెళ్లు చర్చ చేపట్టాయి. అయితే ఈ చర్చ కొన్నాళ్లు ఆగిపోయింది. ఇంతకీ ఆ భవనాలను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేదే అసలు ప్రశ్న. త్వరలోనే రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు మంత్రి నారాయణ. అందరితో చర్చించి వాటిని ఏంచాయాలనే విషయంపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
రుషికొండ భవనాలను సీఎం నివాసం కోసం కట్టారా, లేక అతిథులకోసం కట్టారా..? అనే విషయంపై వైసీపీ క్లారిటీ ఇవ్వడంలేదు. అవి ప్రభుత్వ భవనాలు అని మాత్రమే చెబుతోంది. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, విశాఖను పాలనా రాజధాని చేసి ఉంటే, రుషికొండ భవనాలు మరింత హైలైట్ అయ్యేవి. ఆరెండూ జరగలేదు కాబట్టి కూటమి హయాంలో ఆ భవనాలను ఏంచేస్తారనేది తేలాల్సి ఉంది. జగన్ హయాంలో పూర్తయిన నిర్మాణాల గురించి ఇప్పడు చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని చెప్పారు మంత్రి నారాయణ. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విషయంలో ఇతర దేశాల మోడళ్లను పరిశీలించి ఇక్కడ కూడా అవే పద్ధతుల్ని అమలు చేస్తామని చెప్పారు నారాయణ.
ఏపీలో హైడ్రా..
హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపులో హైడ్రా ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. విశాఖలో కూడా అలాంటి ఆక్రమణలే ఉన్నాయని, వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని, లేకపోతే హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, అలాంటి వాటిని వదులుకోవాలని పిలుపునిస్తున్నట్టు తెలిపారు మంత్రి నారాయణ. ఆ నిర్మాణాలు వదులుకోకపోతే తామే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టామని చెప్పారు నారాయణ.