రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి.. అమరావతిపై ఆసక్తికర అప్ డేట్

అమరావతిపై నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నా, రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమేనా..? అనేది తేలాల్సి ఉంది.

Advertisement
Update:2024-06-15 19:29 IST

ఏపీ రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం విషయంలో ఏ ప్రభుత్వం ఏ డెడ్ లైన్ పెట్టినా ఎవరూ నమ్మలేని పరిస్థితి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అమరావతి, పోలవరం రెండిట్నీ సాగదీసింది. ఇక 2019 నుంచి 2024 వరకు మూడు రాజధానుల్లో ఎంత పని జరిగింది, పోలవరంలో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతి, పోలవరాన్ని భుజానికెత్తుకుంది. రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని నమ్మకంగా చెబుతున్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ.

అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి నారాయణ. రాజధాని అభివృద్ధికి ప్రణాళిక సిద్ధంగా ఉందని, రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారాయన. అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు అందజేశారని గుర్తు చేశారు. గతంలో రూ.48వేల కోట్లతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించామని, రూ.9వేల కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించామని వివరించారు. అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయన్నారు మంత్రి నారాయణ.

మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యత సీఎం చంద్రబాబు తనపై ఉంచారని అన్నారు మంత్రి నారాయణ. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానన్నారు. టిడ్కో ఇళ్లపై కూడా నారాయణ స్పందించారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో 11 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామని, వాటిని గత ప్రభుత్వం పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు నారాయణ. త్వరలోనే మిగిలిన అన్నిరకాల సౌకర్యాలు కల్పించి ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు నారాయణ. అమరావతిపై నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నా, రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమేనా..? మళ్లీ అరకొర నిర్మాణాలతోనే మమ అనిపిస్తారా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News