పవన్ పై నేను పోటీ చేస్తా.. అలీకి మంత్రి కారుమూరి కాంపిటీషన్

వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ తణుకు నియోజకవర్గాన్ని ఎంచుకుంటే, తాను ఆయనపై పోటీ చేసేందుకు సిద్థంగా ఉన్నానన్నారు. తణుకులో పవన్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తానన్నారు.

Advertisement
Update:2023-01-21 17:46 IST

జగన్ గారూ నన్ను ఆపొద్దు..

జగన్ అన్నా ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వండి..

నన్ను ఆశీర్వదించండి, పవన్ పై యుద్ధానికి నేను వెళ్తా..

ఇలాంటి అభ్యర్థనలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమధ్య ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ, వచ్చే ఎన్నికల్లో జగన్ ఆదేశిస్తే పవన్ కల్యాణ్ పై తాను పోటీ చేయడానికి సిద్ధం అని చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. పవన్ ఆదేశిస్తే జగన్ పై తాను కూడా పోటీ చేస్తానంటూ జబర్దస్త్ ఆది చెప్పినట్టుగా మీమ్స్ సందడి చేశాయి. అసలు వారు వీరు ఆదేశించాల్సిన పని లేదు, నాకు నేనే ఫలానావారిపై పోటీ చేస్తానంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల సంగతి ఎలా ఉన్నా.. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

పవన్ పై నేను పోటీ చేస్తా..

బుట్టాయగూడెంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కారుమూరి.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా గెలుపు మాత్రం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. 175 స్థానాల్లోనూ తమ పార్టీయే గెలుస్తుందని చెప్పారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయన్నారు కారుమూరి. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ తణుకు నియోజకవర్గాన్ని ఎంచుకుంటే, తాను ఆయనపై పోటీ చేసేందుకు సిద్థంగా ఉన్నానన్నారు. తణుకులో పవన్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తానన్నారు. పవన్, లోకేష్, చంద్రబాబు.. ఎవరు ఎక్కడ పోటీ చేసినా వైసీపీదే విజయం అన్నారు కారుమూరి.

పాదయాత్రలతో ఒరిగేదేముంది..?

చంద్రబాబు, లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా టీడీపీకి ఒరిగేదేమీలేదన్నారు మంత్రి కారుమూరి. లోకేష్ ని ప్రజలు జోకర్ గా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్‌ పై నమ్మకంతో ఉన్నారని ఆ నమ్మకంతోనే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారాయన. అయితే కారుమూరి ఎప్పుడు ఏం మాట్లాడినా పెద్దగా మీడియా అటెన్షన్ ఉండదు. ఈసారి పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తాననే సరికి ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. 

Tags:    
Advertisement

Similar News