లేఖపై చర్చకు సిద్ధం.. పవన్ కి వైసీపీ సవాల్
పవన్ లేఖ రాయాల్సింది ఇళ్ల నిర్మాణంపై కాదని, చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ మీద అని సూచించారు మంత్రి జోగి రమేష్. త్వరలో తాము కూడా చంద్రబాబు అవినీతిపై ప్రధానికి లేఖ రాయబోతున్నట్టు తెలిపారు.
ఏపీలో పేదలకోసం నిర్మిస్తున్న ఇళ్ల పథకంలో అవినీతి జరిగిందని ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. పవన్ రాసిన లేఖపై వైసీపీ స్పందించింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పవన్ కి బదులిచ్చారు. పవన్ కల్యాణ్ లేఖలో ప్రతి అంశం మీద చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దమ్ముంటే పవన్ కల్యాణ్ తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు జోగి రమేష్.
గంట చర్చలు 23గంటలు నిద్ర..
ఎన్నికలు వస్తున్నాయి కదా అని రాష్ట్రానికి వస్తున్న పవన్ కల్యాణ్.. ఒక గంట కార్యకర్తలతో మాట్లాడి.. 23 గంటలు హోటల్ రూమ్ లో పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్. 17వేల పైచిలుకు జగనన్న కాలనీలు కడుతున్నామని, తమ ప్రభుత్వం కట్టేవి ఇళ్లు కాదని, ఊళ్లకు ఊళ్లే శరవేగంగా నిర్మాణమవుతున్నాయని అన్నారు. కళ్లు కుట్టి.. కడుపు మంటతో పచ్చ రోగుల్లా.. ప్రధానికి లేఖలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్లలో స్కాం జరిగిందంటూ ప్రధానికి లేఖ రాయటం సరికాదని అన్నారు మంత్రి జోగి రమేష్. ప్రధానికి పవన్ రాసిన లేఖలోని 13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానాన్ని పంపిస్తున్నానని చెప్పారాయన. ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. అంతా ఆన్ లైన్ పేమెంట్లు జరిగితే అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ప్రశ్నించారు. అసలు ఏపీలో పవన్ కల్యాణ్ కు ఇల్లు ఉందా? ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం ఓటు అయినా ఉందా? అని ప్రశ్నించారు మంత్రి. చంద్రబాబు తాబేదారుగా మారిన పవన్ ఏ గడ్డి కరవటానికైనా సిద్ధపడతాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ లేఖ రాయాల్సింది ఇళ్ల నిర్మాణంపై కాదని, చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ మీద అని సూచించారు మంత్రి జోగి రమేష్. త్వరలో తాము కూడా చంద్రబాబు అవినీతిపై ప్రధానికి లేఖ రాయబోతున్నట్టు తెలిపారు. చంద్రబాబు దోచేసిన స్కిల్ స్కామ్ లో పవన్ కి ఎంత ముట్టిందని ప్రశ్నించారు. ఈ స్కామ్ లో పవన్ కి ఏ విధంగా మనీలాండరింగ్ జరిగింది..? ఆయనకు ఎంత ప్యాకేజీ ముట్టిందనే విషయంపై లేఖ రాస్తామన్నారు మంత్రి జోగి రమేష్.