లోకేష్ పాక్కునే యాత్ర చేసినా వేస్ట్..
గతంలో వైఎస్ఆర్, జగన్ చేసిన పాదయాత్రలకు ఓ అర్థం ఉందని, అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలతో మమేకమై కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు పాదయాత్రలు చేశారని చెప్పారు మంత్రి అమర్నాథ్.
నారా లోకేష్ పాదయాత్ర ప్రకటనపై కాస్త ఆలస్యంగా అయినా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నేతలు. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని సెటైర్లు పేలుస్తున్నారు. అసలు పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని నిలదీశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పాదయాత్రలు వైఎస్ ఫ్యామిలీ పేటెంట్ హక్కు అని చెప్పారు.
ఎందుకీ యాత్ర..?
అసలు నారా లోకేష్ పాదయాత్రకు అర్థమేముందని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. గతంలో వైఎస్ఆర్, జగన్ చేసిన పాదయాత్రలకు ఓ అర్థం ఉందని, అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలతో మమేకమై కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు పాదయాత్రలు చేశారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, మూడున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్తుంటే వారు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరం లోకేష్ కి ఏమొచ్చిందని ప్రశ్నించారు అమర్నాథ్. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు లేదని విమర్శించారు.
త్వరలోనే బిల్లు, ఆ తర్వాత పాలన..
త్వరలోనే ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతామన్నారు మంత్రి అమర్నాథ్. విశాఖనుంచి పాలన మొదలు పెడతామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఏదీ జరగదని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని డ్రామాలు ఆడినా ఉపయోగం లేదన్నారు. లోకేష్ 4 వేల కిలోమీటర్లు కాదు.. 40 వేల కిలోమీటర్లు పాక్కుంటూ పాదయాత్ర చేసినా టీడీపీని అధికారంలోకి తీసుకురాలేరన్నారు.