ఇష్టం వచ్చిన "ఫిగర్లు".. కలకలం రేపిన అమర్నాథ్ ట్వీట్లు..
"బాబూ పవన్ కల్యాణ్.. ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. 25 కాదు. ఇష్టం వచ్చిన "ఫిగర్లు" వద్దు బాబూ..!" అంటూ ట్వీట్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఏపీలో పొలిటికల్ ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. విశాఖ గర్జనపై పవన్ కల్యాణ్ ట్వీట్లు, దానికి ప్రతిగా మంత్రుల స్పందనలు హాట్ హాట్ గా మారాయి. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏపీ అనే ట్వీట్ మరింత వైరల్ గా మారింది. ఈ క్రమంలో పవన్ 25 జిల్లాలు, 25 రాజధానులు అన్నారు. అక్కడ వైసీపీ నేతలు మరో పాయింట్ పట్టుకున్నారు. ఏపీలో ఉన్నవి 26 జిల్లాలని, 25 జిల్లాలు కావని మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు పేల్చారు. "బాబూ పవన్ కల్యాణ్.. ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. 25 కాదు. ఇష్టం వచ్చిన "ఫిగర్లు" వద్దు బాబూ..!" అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ అమర్నాథ్ "ఫిగర్లు" అనే పదాన్ని కోట్స్ లో పెట్టడాన్ని తప్పుబడుతున్నారు జనసైనికులు.
దత్తపుత్రుడి దృష్టిలో 3 క్యాపిటల్స్ అంటే వేరే ఉన్నాయని, 1-అంతర్జాతీయ రాజధాని మాస్కో, 2-జాతీయ రాజధాని ముంబై, 3-పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. అంటూ మరో సెటైర్ పేల్చారు అమర్నాథ్. పరోక్షంగా పవన్ వివాహాలను ఇక్కడ అమర్నాథ్ ప్రస్తావించినట్టయింది. దీంతో జనసైనికులు మరింత ఘాటుగా స్పందిస్తున్నారు.
ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు..
గుడివాడ అమర్నాథ్ కి సోషల్ మీడియాలో జనసేన వీర మహిళలు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. చేతిలో పప్పు గుత్తి, చపాతీ కర్ర, చీపురు కట్ట పెట్టుకుని మహిళలు సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. "గుడివాడ అమర్నాథ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు" అంటూ.. తీసుకున్న ఈ వీడియోలను జనసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వరుసగా 10మంది మహిళలు ఇదే డైలాగ్ చెబుతూ.. చేతిలోని వస్తువుల్ని చూపిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు, వాటికి ప్రతిగా వీర మహిళల స్టేట్ మెంట్లు హైలెట్ అవుతున్నాయి. అమరావతి యాత్ర వ్యవహారం కాస్తా ఇప్పుడు వైసీపీ మంత్రులు వర్సెస్ పవన్ కల్యాణ్ అన్నట్టుగా మారిపోయింది.