కోటంరెడ్డిది ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్- మంత్రి గుడివాడ

పార్టీ నుంచి వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకునేందుకు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇక్కడ భవిష్యత్తు లేదు అని భావిస్తే ఎప్పుడైనా వెళ్లిపోవచ్చన్నారు.

Advertisement
Update:2023-02-01 12:29 IST

ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ఆరోపణలను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. కోటంరెడ్డిది ట్యాపింగ్‌ కాదని.. రికార్డింగ్ అయి ఉంటుందన్నారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు వారిలో ఒకరు ఆ ఫోన్‌ కాల్‌ను రికార్డు చేస్తే అది ట్యాపింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు కాకుండా మూడో వ్యక్తి చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటారన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ పంపిన ఆడియో క్లిప్.. కోటంరెడ్డితో మాట్లాడిన వ్యక్తి రికార్డు చేసి ఇచ్చినది అయి ఉండవచ్చు కదా అని మంత్రి ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కూడా ఇలాగే తన ఫోన్‌ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారని.. అది కూడా స్టీఫెన్ సన్ రికార్డు చేసిన ఆడియో అయి ఉండవచ్చన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకునేందుకు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇక్కడ భవిష్యత్తు లేదు అని భావిస్తే ఎప్పుడైనా వెళ్లిపోవచ్చన్నారు. ఇలా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం సరికాదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నారే గానీ.. ఆడియో టేపు పంపిన సీతారామాంజనేయులు.. అది ట్యాపింగ్ చేసిన ఆడియో అని చెప్పలేదు కదా అని అమర్నాథ్‌ ప్రశ్నించారు.

మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనుక్కు తీసుకుందని.. అలాంటప్పుడు ఇక మూడు రాజధానులపై కోర్టు చెబితే ఏంటి? చెప్పకపోతే ఏంటి? అని ప్రశ్నించారు. బిల్లే లేనప్పుడు ఇక కోర్టు ధిక్కరణకు ప్రశ్న ఎక్కడ ఉంటుందన్నారు.

Tags:    
Advertisement

Similar News