సమస్యల పరిష్కారం కోసం కాళ్లుపట్టుకునే నేర్పుండాలి..

ఉద్యోగ సంఘాల నేతలు ఎప్పుడూ దండోపాయానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ వారికి అవసరమైతే కాళ్లుపట్టుకునేంత నేర్పు కూడా ఉండాలని చెప్పారు మంత్రి బొత్స. సమస్యల పరిష్కారం కోసం కాళ్లు పట్టుకోవడం అనే సూచన సంచలనంగా మారింది.

Advertisement
Update:2022-11-28 08:19 IST

ఉద్యోగుల సమస్యలు ఒక్కరోజులో పరిష్కారమయ్యేవి కావని, సమయం పడుతుందని, వేచి చూడాలని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. అదే సమయంలో ఆయన ఉద్యోగులకు చేసిన ఓ సూచన ఇప్పుడు వైరల్ గా మారింది. సామ, దాన, భేద దండోపాయాల గురించి చెబుతూ, ఉద్యోగ సంఘాల నేతలు ఎప్పుడూ దండోపాయానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ వారికి అవసరమైతే కాళ్లుపట్టుకునేంత నేర్పు కూడా ఉండాలని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కాళ్లు పట్టుకోవడం అనే సూచన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఫ్లోలో ఆ మాట అనేసినా, ఆ తర్వాత టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం మొదలు పెట్టింది. కాళ్లు పట్టుకుంటేనే ఆ సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటే, అలాంటి నాయకులు మనకొద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామంటూ టీడీపీనుంచి ట్వీట్లు పడుతున్నాయి.

ఉద్యోగుల సమస్యలపై తాత్సారం ఎందుకు..?

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ విషయంలో కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఇప్పటికిప్పుడు తీరిపోయేది కాదు కానీ, ఆ తర్వాత సీపీఎస్ రద్దు వ్యవహారం ఉండనే ఉంది. సీపీఎస్ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఊగిసలాట ప్రతిపక్షాలకు వరంగా మారుతోంది. గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయలేక సీఎం జగన్ మాట తప్పారని, మడమ తిప్పారనే విమర్శలు మొదలయ్యాయి. ఇక ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ సమయంలో కూడా ఆలస్యం జరిగింది. ఆ తర్వాత వాళ్లు కూడా సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు అంటూ ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

తాజాగా ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర మహా జనసభలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. వారి సర్వీస్ రూల్స్ విషయంలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, సీఎం తలదించుకోవాల్సి వస్తుందని, కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News